టీటీడీ పాలకమండలి పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) అసంతృప్తి వ్యక్తపరిచారు. తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేలపై టీటీడీ వివక్ష చూపుతోందని ఆయన మండిపడ్డారు. శుక్రవారం ఆయన కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన సిఫార్సు లేఖలపై స్పందించారు.
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఫిబ్రవరి 1 పరిగణలోకి తీసుకుంటామని నూతనంగా ఎన్నికైన చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) చెప్పారని ఎంపీ తెలిపారు. అయినా కూడా నేటికీ అమలు కాకపోవడం బాధాకరం అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలు, ఎంపీ లకు బ్రేక్ దర్శనాలు, వసతి సౌకర్యాలు కల్పించిన టీటీడీ.. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులకు మాత్రమే టీటీడీ సౌకర్యాలు కల్పించి, లెటర్స్ కి అనుమతిస్తుందని అన్నారు. ఇలా వివక్ష చూపడం నిజంగా బాధాకరమైన విషయమని అని ఎంపీ అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశించినా, పాలక మండలి అంగీకరించినా.. అధికారులు ఎందుకు అమలు చేయడం లేదు? అని ప్రశ్నించారు. ఈ అంశంపై టీటీడీ అత్యవసర సమావేశమై పునరాలోచించాలని సూచించారు.
వేసవి సెలవులు వస్తున్న తరుణంలో తెలంగాణ ప్రజలకు సిఫారసు లేఖలు అందజేస్తామని.. వాటిని అనుమతించి బ్రేక్ దర్శనం కల్పించాలని అయన కోరారు. ఒకవేళ అనుమతి కల్పించకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతిధులం పార్టీలకు అతీతంగా తిరుమలకు వచ్చి తేల్చుకుంటామని ఆయన(Raghunandan Rao) హెచ్చరించారు.