ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికాలో చదువుకోవాలని ఎంతో మంది పిల్లలకు కోరిక ఉండడం సహజం. అయితే కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ల నేపథ్యంలో చాలామంది అమెరికా వెళ్లి చదవాలనుకునేవారికి తిప్పలు తప్పడంలేదు. కానీ అమెరికా వెళ్లి చదవాలనుకునేవారికి ఆ దేశం ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది.
జూన్ 14వ తేదీ సోమవారం నుంచి విద్యార్థి వీసా ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో కాన్సులర్ వ్యవహారాల మంత్రి డాన్ హెప్లిన్ తెలిపారు. ఈ విషయాన్ని ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా గురువారం నాడు వెల్లడించారు.
ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో ప్రారంభమయ్యే తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు వీసాల జారీలో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కానీ పర్యాటక వీసాలైన బి1, బి2 కోసం ఎదురుచూసేవారు మాత్రం ఇంకొంత కాలం ఎదురుచూడక తప్పని పరిస్థితి ఉంది.
కరోనా రెండో వేవ్ నేపథ్యంలో అమెరికా వచ్చే వారి విషయంలో అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని రాయబార కార్యాలయం, ముంబై, చెన్నై, కోల్ కతా, హైదరాబాద్ లలోని కాన్సులేట్ కార్యాలయాల్లో అత్యవసర వీసాలు మినహా ఇతర అన్ని రకాల వీసా సేవలను ఈ ఏడాది మే నెల మూడో తేదీ నుంచి నిలిపివేసింది. అమెరికాలో యూనివర్శిటీలు జులై, ఆగస్టు నెలలో ప్రారంభమవుతాయి. జనరల్ గా యూనివర్శిటీ జారీ చేసే ఐ20 పత్రంలో పేర్కొన్న తేదీకి 30 రోజుల ముందుగా విద్యార్థులు అమెరికా వెళ్లేందుకు అవకాశం ఉండదు.
తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే వీసాలు పొందిన విద్యార్థులు ఆ గడువుతో సంబంధం లేకుండా అమెరికా వెల్లవచ్చు. వీసా లేనివారు రాయబార, కాన్సులేట్ కార్యాలయాల్లో పూర్తి స్థాయి సేవలు ప్రారంభించేంతవరకు వేచిఉండాల్సిందే అని అప్పట్లో అమెరికా సర్కారు స్పష్టం చేసింది. కానీ ఇండియాలో కరోనా రెండో వేవ్ తగ్గుముఖం పట్టడంతో రాయబార కార్యాలయంతో పాటు నాలుగు కాన్సులేట్ ఆఫీసుల్లో వీసా ప్రక్రియను జులై 14 నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు సదరు మంత్రి వివరించారు.
అమెరికా వెళ్లే విద్యార్థులెవరైనా అమెరికా ప్రయాణ తేదీకి మూడు రోజుల ముందుగా కరోనా పరీక్ష చేయించుకోవాలని అక్కడి ప్రభుత్వం తెలిపింది. నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే విమాన ప్రయాణానికి అనుమతిస్తారు. అయితే వ్యాక్సిన్ విషయంలో ఆయా యూనివర్శిటీలదే తుది నిర్ణయం ఉంటుంది. వ్యాక్సిన్ వేయించుకోవాలా? లేదా? ఒకవేళ వ్యాక్సిన్ తప్పనిసరైతే ఏ వ్యాక్సిన్ వేయించుకోవలి? అనేది యూనివర్శిటీ అధికారులతో సంప్రదించి విద్యార్థులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి హెప్లిన్ స్పష్టం చేశారు.