ఇళయరాజా.. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు, సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని. చిత్రపరిశ్రమలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సంగీత దర్శకుడు ’ఇళయరాజా’. అయితే అనుమతి లేకుండా తన పాటలు వాడుకుంటున్నారని యువ సంగీత దర్శకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన తాజాగా మరో వివాదంతో వార్తల్లో నిలిచారు.
ఇటీవల ఆయన తన 76వ పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. ఈ క్రమంలో చెన్నైలో ఇళయరాజా కోసం ఓ కచేరీ వేడుకను నిర్వహించారు. ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం, జేసుదాస్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.అయితే కార్యక్రమం జరుగుతుండగా మధ్యలో ఓ సెక్యురిటీ గార్డ్ మంచి నీళ్ల సీసాలు ఇవ్వడానికి స్టేజ్ పైకి వచ్చారు. దాంతో అతడిపై మండిపడ్డాడు ఇళయరాజా. అనుమతి లేకుండా స్టేజ్ పైకి ఎందుకు వచ్చావ్ అని అతడిని తిట్టిపోశారు. దాంతో అతడు క్షమాపణలు చెబుతూ ఇళయరాజా కాళ్లు పట్టుకున్నారు.
ఆ తరువాత పదివేలు ఇచ్చి సీట్లు బుక్ చేసుకున్న వారి స్థానాల్లో రూ.500, రూ.1000 ఇచ్చి సీట్లు కొనుక్కున్నవారు కూర్చున్నారంటూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.