ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ తో తెలంగాణ సిఎం కేసిఆర్ లాలూచీ పడ్డారని ఆరోపించారు ఎఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ఆయన ఏమన్నారో చదవండి…”టీఆర్ఎస్ పెద్ద మనుషులు కాంగ్రెస్ హాయంలో 28వేల ఎకరాల భూములు అక్రమంగా కేటాయింపులు జరిగినట్లు కాగ్ నివేదికలో వుందని మాట్లాడుతున్నారు. మంత్రి కేటీఆర్, హరీష్ రావులకు దమ్ముంటే దీనిపై బహిరంగ చర్చకు రావాలి. రాజశేఖర్ రెడ్డి హాయంలో కేటాయింపు జరిగిన మాట వాస్తవం. అందులో వుంటే లోటుపాట్లని సరిదిద్దడానికి కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో జీవో 571తీసుకొచ్చారు.
కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ జీవోని అనుసరించిన చేసిన జీవో 61ని అమలు చేయలేదు. కాగ్ రిపోర్ట్ లో వున్న అక్రమ కేటాయింపులని సరిదిద్దే ఏ చర్య తీసుకోలేదు. కాంగ్రెస్ హాయంలో తప్పుడు కేటాయింపు జరిగినట్లేయితే తెలంగాణ వచ్చిన తర్వాత వాటిని సరిదిద్దాలి. కానీ ఈ ఏడేళ్ళలో అలా జరగలేదు.
ఏంఆర్ ప్రాపర్టీస్, హిందూ ఇన్ఫోటెక్, బ్రహ్మాణీ ఇన్ఫోటెక్, రావిలాల, మావిడిపల్లి.. తదితర భు కేటాయింపుల్లో ఒక్క ఇంచ్ భూమిని కూడా వెనక్కి తీసుకురాలేదు. కారణం..తెలంగాణలో కేటాయించిన భూముల్లో సగం జగన్ మోహన్ రెడ్డి, ఆయన బినామీ పేర్ల పైనే వున్నాయి. జగన్ మోహన్ రెడ్డితో కేసీఆర్ లాలుచీపడ్డారు.
రాజశేఖర్ రెడ్డి హాయంలో అక్రమకేటాయింపులు జరిగుండొచ్చు. కానీ తెలంగాణ కు సంబధించి టీఆర్ఎస్ అధికారంలో వచ్చాక వాటిని సరిదిద్దే ప్రయత్నం ఎందుకు చేయలేదు? మీకు దమ్ముంటే ఏంఆర్ ప్రాపర్టీస్ దగ్గరికి పోదాం.. 500ఎకరాల భూములు అక్రమంగా కేటాయించారని కాగ్ నివేదికలో వుంది కదా.. కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంతా అక్కడి వస్తారు. అక్రమంగా కేటాయించిన భూములు వెనక్కి తీసుకుంటారా ? ” అని సవాల్ చేశారు దాసోజు.