తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త : 7 వేల రెగ్యులర్ పోస్టులు

0
87

తెలంగాణ నిరుద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం 3వేల పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం మరో 7 వేల పోస్టులను రెగ్యులర్ ప్రాతిపధికన నియమించనున్నట్లు రెండో ప్రకటన జారీ చేసింది. ఉద్యోగాలు రాకపోవడంతో తెలంగాణ తెచ్చుకుని దండగ అని ఆవేదనతో ఉన్న నిరుద్యోగ యువత ఆవేదనకు నిప్పుల మీద నీళ్లు చల్లినట్లు ప్రభుత్వం ఈ కొలువుల మంజూరు అంశాన్ని తెరమీదకు తెచ్చింది. పూర్తి వివరాలు…

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది సర్కారు. కొత్తగా ఏర్పాటు చేసిన 7 మెడికల్ కాలేజీలు, 15 నర్సింగ్ కాలేజీల్లో కలిపి ఏడు వేలకు పైగా ఉద్యోగాలను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రెగ్యులర్ ప్రాతిపదికన 7,727 ఉద్యోగాలను నియమించనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు రెగ్యులర్ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉద్యోగాల భర్తీకి ముందు వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖల అనుమతి తీసుకావలని సూచించారు. మంజూరు చేసిన పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ సర్వీస్ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. ఈ మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల్లో 3035 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు ఆర్థిక శాఖ బుధవారం నాడు అనుమతించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ ప్రాతిపదికన మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో కలిపి (7727+3035) మొత్తం 10,762 పోస్టులు మంజూరయ్యాయి. ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలలో మెడికల్ కాలేజీల్లో 2135, నర్సింగ్ కాలేజీల్లో 900 పోస్టులు ఉన్న విషయం తెలిసిందే.

రాష్ట్రంలో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల కేంద్రాల్లో కొత్త మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి కాలేజీలో 34 వైద్య విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు సహా ఇతర పోస్టులను మంజూరు చేశారు. ఒక్కో వైద్య కాలేజీకి 1001 పోస్టుల చొప్పున ఏడు కాలేజీలకు 7007 ఉద్యోగాలు మంజూరయ్యాయి.

ఇక నర్సింగ్ కాలేజీల పోస్టుల విషయానికి వస్తే… రాష్ట్రంలో ఇటీవల 13 నర్సింగ్ కాలేజీలు, మరో రెండు కొత్త కాలేజీలకు కలిపి 720 పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అంటే రెగ్యులర్ ప్రాతిపదికన మరియు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కలిపి (720 +900) 1620 పోస్టులు రానున్నాయి. రెగ్యులర్ పోస్టుల భర్తీ విషయంలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రతి నర్సింగ్ కాలేజికి ప్రొఫెసర్ / ప్రిన్సిపాల్, ప్రొఫెసర్/వైస్ ప్రిన్సిపాల్, మరో ఏడుగురు ప్రొఫెసర్లు, 12 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 20 మంది లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. పరిపాలనా విభాగానికి 7 ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 48 చొప్పున 15 నర్సింగ్ కాలేజీలకు 720 పోస్టులు మంజూరు చేశారు. వీటిని ఎప్పటిలోగా భర్తీ చేస్తారన్నది ఆచరణలో చూడాల్సిందే.

 

3వేల ఔట్ సోర్సింగ్ పోస్టుల వార్త కోసం కింద చదవండి…

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : ఔట్ సోర్సింగ్ లో 3035 ఉద్యోగాల భర్తీ