వాసాలమర్రి కేసిఆర్ దావత్ లో బువ్వ తిన్న 18 మందికి అస్వస్థత

0
105

తెలంగాణ సిఎం కేసిఆర్ ఆ గ్రామ ప్రజలకు దావత్ ఇచ్చారు. కానీ ఆ దావత్ లో బువ్వ తిన్న 18 మంది అనారోగ్యం పాలయ్యారు. పూర్తి వివరాలు ఇవీ…

యాదాద్రి జిల్లా వాసాలమర్రి గ్రామాన్ని సిఎం కేసిఆర్ దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో మంగళవారం నాడు 2500 మందికి దావత్ ఇచ్చారు. గ్రామ యావన్మంది దావత్ కు వచ్చి భోజనం చేశారు. 23 రకాల వంటకాలతో భోజనాలు వడ్డించారు. కానీ దావత్ లో పాల్గొన్న వారిలో 18 మందికి అస్వస్థత వచ్చింది. సిఎం కేసిఆర్ పక్కన కూర్చొని భోజనం చేసిన వృద్ధురాలు ఆకుల ఆగమ్మ సభ నుంచి బయటకు వస్తున్న సందర్భంలోనే వాంతులు చేసుకున్నది. తర్వాత రాత్రి మరోసారి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దాంతో ఆమెను కుటుంబసభ్యులు భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో గురువారం డిచ్ఛార్జి చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిప్రకాశ్ తెలిపారు.

అయితే ఇదే దావత్ లో పాల్గొన్న ఒక బాలిక అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరి రాత్రికే బాగై డిచ్ఛార్జి అయింది. అలాగే మరో 16 మంది వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధపడుతుండడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించారు. 2500 మంది దావత్ లో పాల్గొంటే కేవలం 18 మందికి మాత్రమే అస్వస్తత కలిగిందని, ఇందులో ఫుడ్ పాయిజన్ అయినట్లు ఆధారాలు లేవని డాక్టర్లు చెప్పారు. కొందరికి భోజనం పడక ఇలా అనారోగ్యానికి గురైనట్లు చెప్పారు. అందరూ రికవరీ కావడంతో వైద్య అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.