మొసలి అనగానే అది ఎంత క్రూరంగా ఉంటుందో తెలిసిందే. నీటిలో ఉందంటే దాని బలమైన దవడలతో ఎంత పెద్ద జంతువుని అయినా ఇట్టే చంపేస్తుంది. ఇక మాంసం ఎంతలా తింటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే ఇక్కడ ఆలయంలో ఓ మొసలి అసలు మాంసం ముట్టుకోదు. పూర్తి శాఖాహారం తీసుకుంటుంది. అంతేకాదు దానిని పూజారి వెళ్లిపో అంటే వెళుతుంది. మరి ఈ మొసలి ఎక్కడ ఉంది. ఆ ఆలయం ఏమిటి అనేది చూద్దాం.
కేరళలోని కసరగడ్ జిల్లాలోని అనంతపురలో జీవిస్తున్న ఈ మొసలిని దైవంగా భావిస్తారు జనం. ఇక్కడ శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయంలోని సరస్సులో ఈ మొసలి జీవిస్తోంది. ఇక్కడ ప్రజలు దీనిని బబియా అని పిలుస్తారు. ఈ సరస్సును ఆనుకుని ఉన్న ఆలయానికి ఈ మొసలి నిత్యం కాపలా కాస్తుంది. ఇక పూజారి గుడిలో పెట్టే ప్రసాదం తప్ప మరే ఆహారం తీసుకోదు. ఎవరూ దీనికి మాంసం పెట్టరు. అంత నిష్ఠగా ఉంటుంది.
ప్రతీ రోజూ మొసలి సరస్సు విడిచి ఆలయంలోకి కూడా ప్రవేశిస్తుంది. అయితే, భక్తులకు ఎలాంటి హాని చేయదు. మరో చిత్రం ఏమిటంటే. ఈ మొసలి పూజారి మాట విని సరస్సులోకి తిరిగి వెళ్లిపోతుంది. ఇలా చేయడం చూసి అక్కడ ఉన్న వారు అందరూ షాక్ అవుతారు. అయితే ఇక్కడ ఆలయానికి ఇది కాపలా కాస్తుంది అని ప్రజలు నమ్ముతారు.