సైబర్ వారియర్ 2.0 ఆవిష్కరించిన తెలంగాణ డిజిపి

0
109

పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం
సైబర్ వారియర్ 2.0 సిరీస్ అవిష్కరించిన డిజిపి
మహిళల రక్షణ విషయంలో మరింత పటిష్ట చర్యలు

దేశంలో తెలంగాణ పోలీసులకు ఉన్న గౌరవం, కీర్తి మరింత పెంచే విధంగా పోలీస్ అధికారులంతా చిత్తశుద్ధితో పని చేయాలని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పోలీస్ ఉన్నతాధికారులు, కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేసుల విచారణ, దర్యాప్తు, కోర్టులలో శిక్షల శాతం, పెట్రోలింగ్ వాహనాల పనితీరు, స్టేషన్ రైటర్లు, రిసెప్షన్, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకుంటున్న చర్యలతో పాటు వివిధ వర్టీకల్స్ విభాగాలను సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసం అన్ని స్థాయిల అధికారులు సమర్ధవంతంగా పనిచేస్తూ నిందితుల అరెస్ట్, న్యాయస్థానాల ద్వారా అలాంటి వారికి శిక్షలు పడే విధంగా చేయడం ద్వారా ప్రజలలో పోలీసుల పట్ల నమ్మకాన్ని మరింత పెంచడం, ప్రజా మన్ననలు పొందేలా విధి నిర్వహణ చేయాలని సూచించారు.

డిజిపి జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న నల్లగొండ పోలీసు ఉన్నతాధికారులు
సైబర్ నేరాల అదుపు లక్ష్యంగా సైబర్ వారియర్ 2.0 ఆవిష్కరణ

పెరిగిపోతున్న సైబర్ నేరాలను అదుపు చేయడంతో పాటు ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అవగాహన కల్పించడం, అన్ని స్థాయిల పోలీస్ అధికారులకు సైతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైబర్ క్రైమ్స్ పట్ల మరింత అవగాహన కల్పించడం లక్ష్యంగా రూపొందించిన ఇన్వెస్టిగేటర్స్ డైరెక్టరీ ఫర్ సైబర్ వారియర్స్ 2.0 పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో అనుభవజ్ఞులైన సైబర్ నిపుణుల ద్వారా ఎన్నో విషయాలను పొందుపరచడం జరిగిందని డిజిపి తెలిపారు.

మహిళా రక్షణకు మరింత పటిష్ట చర్యలు…

తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణ విషయంలో రాజీ లేకుండా సమర్ధవంతంగా పని చేస్తున్నామని డిజిపి తెలిపారు. రానున్న రోజులలో మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళా రక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుందని, ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా వర్టీకల్ ఫంక్షనల్ అమలులో 2020-21 లో ఉత్తమ ఫలితాలు సాధించిన 223 పోలీస్ స్టేషన్లకు, అధికారులకు అవార్డులు, పురస్కారాలను అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు ఎస్పీ నర్మద, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, రవీందర్, ఐటి సెల్ ఇన్స్ పెక్టర్ రౌతు గోపి, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.