తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీలో ట్రబుల్ షూటర్ అని హరీష్ రావుకు ఉత్తగనే పేరు రాలేదు. ఆయన స్కెచ్ వేస్తే దేవుడైనా తల వంచాల్సిందే. అంతగా పర్ఫెక్ట్ ప్లానింగ్, టైమింగ్ ఆయన సొంతం. ప్రత్యర్థలకు నీళ్లు నమిలించడంలో మామ కేసిఆర్ ను మించినోడు హరీష్ రావు. తాజాగా ఒక సంఘటన చూస్తే మీరూ అదే అనుకుంటారు.
ఇంతకూ విషయం ఏమిటంటే… నిన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో దుబ్బాకకు చెందిన ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు టిఆర్ఎస్ ను వీడి బిజెపిలో చేరారు. వారిని బిజెపిలోకి తీసుకుపోయేందుకు స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రమైన ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు. మొత్తానికి బిజెపి అధ్యక్షుడి సమక్షంలో దుబ్బాక మున్సిపాలిటీలోని 7వ వార్డు కౌన్సిలర్ దివిటి కనకయ్య, 8వ వార్డు కౌన్సిలర్ డి బాలకృష్ణ బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.
వెంటనే ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలోకి దిగారు. గంటల తేడాతో నిన్న అటు పోయిన కౌన్సిలర్లను ఇవాళ సొంత గూటికి పట్టుకొచ్చారు. మళ్లీ వారికి హరీష్ రావు స్వయంగా టిఆర్ఎస్ కండువాలు కప్పి స్వాగతం పలికారు. వారు సొంత గూటికి చేరుకోవడంతో బండి సంజయ్ పని, స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు పని తుస్సుమన్నట్లు అయింది. తిరిగి సొంత గూటికి చేరిన కౌన్సిలర్లు మస్తు ఖుషీగా ఉన్నరు. ఎంతైనా మంచి డిమాండ్ వచ్చింది కాబట్టి వాళ్ల ఆనందానికి అడ్డు లేదు.
అసలే టిఆర్ఎస్ సర్కారులో స్థానిక ప్రజా ప్రతినిధులకు ఇజ్జత్ లేకుండాపోయిందని లోలోన రగిలిపోతున్నరు. ఈ పరిస్థితుల్లో అలాంటి వారికి ఈ ఇద్దరు కార్పొరేటర్లు దారి చూపినట్లైంది. మిగతా లోకల్ బాడీ లీడర్లు కూడా ఇట్లనే ప్లాన్ చేసుకుంటే మంచి గిట్టుబాటు ఉంటది కదా అని పలువురు చర్చించుకుంటున్నారు.