విశాఖ ఏజెన్సీ కించుమండ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. గాంధీ జయంతి సెలవు దినం కావడంతో ఉదయం అల్పాహారం తర్వాత తోటి విద్యార్థులతో బట్టలు ఉతకడానికి సమీప గడ్డ అనే కుంట వద్దకు వెళ్లగా..బురిడి ఆనందరావు అనే విద్యార్థి ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యాడు.
ఈ విషయాన్ని తోటి విద్యార్థులు పాఠశాల సిబ్బందికి తెలియజేశారు. దీంతో పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించి విద్యార్థు ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా స్థానికులు సహకారంతో విద్యార్థి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి గడ్డ దిగువన ఒడ్డు పొరలో చాటున విద్యార్థి మృతదేహం లభించింది.
విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తమ కుమారుడు మరణానికి పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు గగ్గోలు పెడుతున్నారు. తమకు న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.