మహారాష్ట్ర ఠాణె జిల్లాలో దారుణం జరిగింది. కదులుతున్న రైలులోకి ప్రవేశించిన దుండగులు బీభత్సం సృష్టించారు. రైల్లో ప్రయాణిస్తున్న 20 ఏళ్ల యువతిపై దోపిడీ దొంగలు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన లక్నో– ముంబై పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైల్లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తున్న ఆ యువతిపై ఎనిమిది మంది దోపిడీ దొంగలు కత్తులతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ కోచ్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల నుంచి నగదు, ఆభరణాలను అపహరించారు. దొంగల దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురై గట్టిగా అరవడంతో ముంబైలోని కాసరా స్టేషన్ వద్ద రైలును ఆపేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆ కోచ్ వద్దకు చేరుకుని ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. ఆ తర్వాత మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొంగల నుంచి రూ. 34 వేల నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.