మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లకు ప్రతిష్ఠాత్మక సీకే ప్రహ్లాద్ ‘గ్లోబల్ బిజినెస్ సస్టెయినబిలిటీ లీడర్షిప్’ అవార్డు వరించింది. కర్బన ఉద్గార రహిత కంపెనీగా మైక్రోసాఫ్ట్‌ను తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషికి గాను అదే సంస్థకు చెందిన మరో ముగ్గురితో కలిసి నాదెళ్ల ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రపంచ దేశాల్లో ప్రైవేట్ రంగంలో అసాధారణ విజయాలు, సుస్థిరత సాధించిన వారికి వ్యాపార దిగ్గజం భారతీయ అమెరికన్ సీకే ప్రహ్లాద్ పేరిట ఈ పురస్కారాన్ని కార్పొరేట్ ఎకో ఫోరమ్(సీఈఎఫ్) సంస్థ 2010 నుంచి అందిస్తోంది.
మైక్రోసాఫ్ట్ అధినేత, వైస్ ఛైర్మన్ బ్రాడ్ స్మిత్, చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్ అమీ హుడ్, చీఫ్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ లుకాస్ జొప్పాతో కలిసి సత్య నాదెళ్ల ఈ అవార్డును పంచుకున్నారు. ఒకే సంస్థకు చెందిన నలుగురు వ్యక్తులు.. పర్యావరణ పరిరక్షణ దిశగా కృషి చేయడం ఇదే తొలిసారి” అని సీఈఎఫ్ వ్యవస్థాపకుడు ఎంఆర్ రంగస్వామి తెలిపారు.
కార్పొరేట్ సంస్థల్లో నాయకత్వం ఎలా ఉండాలో అన్నదానికి సరికొత్త ఉదాహారణగా నిలిచారని చెప్పారు. మైక్రోసాఫ్ట్ వ్యాపార వ్యూహానికి స్థిరత్వమే ప్రధానమైన అంశాన్ని చాటి చెప్పారని పేర్కొన్నారు. సీఈఎఫ్ అడ్వైజరీ బోర్డులోని 24 మంది వేసిన ఓట్ల ద్వారా సీకే ప్రహ్లాద్ విజేతలను ఎంపిక చేసినట్లు సీఈఎఫ్ తెలిపింది.