వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా. దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే వాట్సాప్‌లో పలు ప్రైవసీ కారణాల వల్ల మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోలేరు. అయితే కొన్ని పద్ధతులు ఫాలో అయితే మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో చాలా సులభంగా తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ప్రొఫైల్ పిక్చర్ ఉందో లేదో చూడండి
ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే మొదట దీని నుంచే తెలుసుకోవచ్చు. మీకు వారి ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తే.. అవతలి వాళ్లు మిమ్మల్ని బ్లాక్ చేయనట్లే. కనిపించకపోతే మాత్రం ఇందులో ఉన్న మిగతా పద్ధతులు కూడా ఫాలో అవ్వండి.
లాస్ట్ సీన్, ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేయండి
ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేశారని అనుకుంటున్నారో.. వారి లాస్ట్ సీన్, ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేయడానికి ప్రయత్నించండి. అయితే వాళ్లు లాస్ట్ సీన్ డిజేబుల్ చేస్తే బ్లాక్ చేయకపోయినా కనిపించదు. ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించకపోతే కచ్చితంగా బ్లాక్ చేసినట్లే.
మెసేజ్ పంపండి
ఒకవేళ అవతలివారు మిమ్మల్ని బ్లాక్ చేస్తే మీకు కేవలం ఒక్క టిక్ మాత్రమే వస్తుంది. రెండు టిక్ మార్కులు, బ్లూ టిక్స్ కనిపించవు. కాబట్టి మీరు మెసేజ్ పెట్టి ఎంత సేపయినా ఈ టిక్స్ రాకపోతే మిమ్మల్ని దాదాపు బ్లాక్ చేసినట్లే.
కాల్ చేయండి
మిమ్మల్ని బ్లాక్ చేసినవారికి మీరు కాల్ చేస్తే ఆ కాల్ అవతలివారికి వెళ్లదు. అక్కడ మీకు రింగింగ్ బదులు కాలింగ్ అని మాత్రమే వస్తుంది. అయితే అవతలివాళ్లు ఇంటర్నెట్ ఆపినా కాలింగ్ అనే వస్తుంది.
గ్రూప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి
వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే వారితో మీరు గ్రూప్ క్రియేట్ చేయడం కూడా కుదరదు. కాబట్టి మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చేశారని మీరు అనుకుంటున్నారో వారితో గ్రూప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి.