టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంతర్ రెడ్డి ఆరెస్సెస్ నేపథ్యం నుంచే వచ్చారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన అమరీందర్ సింగ్ కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. బీజేపీతో ఆయన సీట్ల సర్దుబాటు చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అమరీందర్ సింగ్ పై కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్ విమర్శలు గుప్పించారు. అమరీందర్ సింగ్ తనలోని సెక్యులరిస్టును చంపేసుకుంటున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై అమరీందర్ సింగ్ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక మంది నేతలకు ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ ఉందని చెప్పారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోల్ ఆరెస్సెస్ నుంచి కాకపోతే ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ కూడా 14 ఏళ్లు బీజేపీలో ఉన్నారనే విషయాన్ని విస్మరించొద్దని అన్నారు.