కర్ణాటక కలబురిగి జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో సహా బావిలో దూకింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. స్థానికులు ఒకరిని రక్షించారు. మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతులను మద్యాలకు చెందిన లక్ష్మి(28), లక్ష్మి పెద్ద కుమార్తె గౌరవమ్మ(6) సావిత్రి (1)గా గుర్తించారు.
లక్ష్మి తన భర్త, పిల్లలతో కలబురగిలోని అలంద తాలూకా మద్యాల గ్రామంలో నివసించేది. అయితే ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చినందని.. రోజూ ఆమెను భర్త, అత్తమామలు వేధించేవారు. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మి.. పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. గ్రామ శివారులో ఉన్న బావిలో చిన్నారులతో కలిసి దూకేసింది. ఇది గమనించిన స్థానికులు ఐశ్వర్య(4)ను కాపాడారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.