సదర్..యాదవుల ఖదర్. దీపావళి పండుగకు హైదరాబాద్ మహానగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో సదర్ ఒకటి. దివ్వెల పండుగ తర్వాత రోజు నుంచి యాదవులు ఈ ‘సదర్’ ఉత్సవాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఈ ఉత్సవ ప్రత్యేకం. సదర్ సంబరాలు ఏడాదికేడాదికి మరింత వైభవంగా జరుగుతున్నాయి. అయితే సాంస్కృతిక సంబరాన్ని ఆడంబరాల కోసం కమర్షియల్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
సదర్ వేడుకలను తమ ఇమేజ్ కు సిబంల్ గా కొందరు మార్చుకుంటున్నారు. తమ వ్యక్తిగత ప్రతిష్ట కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. డీజే డ్యాన్సులతో కంపుకంపు చేస్తున్నారు. అంతేకాదు మనకు రోజు జీవనోపాధి కల్పించే దున్నపోతులకు పూజలు చేయాల్సింది పోయి..పబ్లిసిటీ కోసం పక్క రాష్ట్రాల నుంచి దున్నపోతులను తీసుకువస్తున్నారు. ఇందుకోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇక సదర్ సంబరాలను కొన్ని ప్రాంతాల్లో రాజకీయ వేదికలుగా మార్చారు. యాదవులు జరుపుకునే పండుగలో ఇతర వర్గాలను భాగస్వామ్యం చేస్తున్నారు. యాదవ ఖదర్ ను తుడిపేస్తూ ఇతర వర్గాలను అందలం ఎక్కిస్తున్నారు. తమ రాజకీయ ప్రాపకం కోసం ఇతర సామాజిక వర్గాల నేతలను సదర్ కు ఆహ్వానిస్తూ మనవాళ్లను నిర్లక్ష్యం చేస్తున్నారు.
సదర్ సంబరాల్లో ఏడాదికేడాదికి వస్తున్న మార్పులపై యాదవ జనాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సదర్ వేడుకలను ఘనంగా జరపడంలో తప్పు లేదు కాని.. ఇలా సంస్కృతి సాంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వడం ఎందుకనే ప్రశ్న వస్తోంది. ఆడంబరాల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని, మన దున్నపోతులను పూజించుకుంటే చాలని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దున్నపోతులను తీసుకువచ్చి షో చేయడం ఎందుకని కొందరు నిలదీస్తున్నారు.
సదర్ సంబరాల్లో ఆడంబరాల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం కాదు.. యాదవ సమాజంలోని పేదలకు అండగా ఉండాలని సూచిస్తున్నారు. యాదవుల్లో చాలా మంది పిల్లలు డబ్బులు లేక ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. అలాంటి వారిని గుర్తించి సాయం చేస్తే యాదవ సమాజానికి మేలు జరుగుతుందని అంటున్నారు. పేద పిల్లల కోసం హాస్టల్స్, స్కూల్స్ కట్టిస్తే ఎంతో మంది ఉన్నత విద్యావంతులు అవుతారని, ఉద్యోగాలు పొందుతారని చెబుతున్నారు. తమ పిల్లల కోసం ఐఏఎస్, ఐపీఎస్ లను వెతికే ధనిక యాదవులు…పేద పిల్లల కోసం ఖర్చు చేస్తే అలా వెతకాల్సిన పని లేకుండానే కలెక్టర్లు, ఎస్పీలు మనలో నుంచే వస్తారని చెబుతున్నారు. అలా జరిగితే యాదవ జాతి అభ్యున్నతికి ఉపకరిస్తుందని అంటున్నారు. ఇకనైనా ధనిక యాదవులు ఇలా ఆడంబరాలు, పబ్లిసిటీ కోసం కాకుండా యాదవ జాతి అభ్యున్నతి కోసం కృషి చేయాలని కోరుతున్నారు.
శెట్టి హరిక్రిష్ణ యాదవ్
జర్నలిస్ట్ (యదువంశీ), హైదరాబాద్
(ఈ వ్యాసంలోని అభిప్రాయం రచయిత వ్యక్తిగతం..ఆల్ టైం రిపోర్టు వెబ్ సైట్ కు సంబంధించినవి కాదు.)