భారత్ లో కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీనితో ప్రజలకు కొంతమేర ఊరట లభిస్తుంది. తాజాగా 8,865 మంది వైరస్ బారిన పడినట్లు తేలింది. ఇది 287 రోజుల కనిష్ఠం కావడం గమనార్హం. కరోనా ధాటికి మరో 197 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 11,971 మంది వైరస్‌ను జయించారు.
దేశవ్యాప్తంగా సోమవారం ఒక్క రోజే 11,07,617 నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 62,57,74,159కి చేరినట్లు చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ మాత్రం కొనసాగుతూనే ఉంది. కొత్తగా 406,235 మందికి కొవిడ్ సోకింది. కరోనా ధాటికి మరో 5,315 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 254,536,544కు చేరగా..మొత్తం మరణాల సంఖ్య 5,121,468కి పెరిగింది.
మరోవైపు కరోనా తగ్గిందన్న ఆలోచనతో ప్రజలు సాధారణ జీవనాన్ని ఇప్పుడిప్పుడే అలవరచుకుంటున్నారు. మహమ్మారి మాటేసిందన్న ఆలోచన మరిచి జనాలు ప్రవర్తిస్తున్నట్టే అనిపిస్తోంది. మాస్కు మరిచారు. సానిటైజర్ ఊసేలేదు. కరోనా తగ్గుముఖం పట్టినా..పోస్ట్ కొవిడ్‌తో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.