దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ ఒక్కసారిగా పెరిగిన కేసులు ఆందోళనకు గురి చేశాయి. ఈ క్రమంలో కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,197 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 301 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
ప్రస్తుతం దేశంలో 1,28,555 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 527 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. డైలీ పాజిటివిటీ రేటు 0.82 శాతంగా ఉంది. 44 రోజుల తర్వాత గణనీయంగా తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది.
తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,44,66,598 కి చేరగా.. మరణాల సంఖ్య 4,64,153కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా నిన్న కరోనా నుంచి 12,134 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3.38,73,890 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.