తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు రోజుల దిల్లీ పర్యటన ప్రధాని మోడీని కలవకుండానే ముగిసింది. ఆయన బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. యాసంగిలో ధాన్యం సేకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం దిల్లీకి వెళ్లారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సోమ, మంగళవారాల్లో కలిసేందుకు అవకాశం లభించలేదని తెలిసింది. బుధవారం ప్రధానితో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ ఉండటంతో కేసీఆర్‌కి అవకాశం లభించలేదని సమాచారం.
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నుంచి స్పష్టత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ వేదికగా కార్యచరణ ముమ్మరం చేశారు. యాసంగిలో ఎంత మేర వడ్లు కొంటారో తేల్చడంతో పాటు..ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాను పక్కాగా కేటాయించాలన్న అంశాన్ని దిల్లీ పెద్దల వద్ద ప్రస్తావించేందుకు వెళ్లారు.
వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి కేసీఆర్ దిల్లీ వెళ్లారు.