వారికి పోస్టింగ్స్ ఎప్పుడిస్తారు..తెలంగాణ సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..

Revant Reddy's open letter to Telangana CM KCR ..

0
75

తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన తెలంగాణలోని ప్రధాన సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మూడు సంవత్సరాలుగా అకారణంగా పోస్టింగ్ లు ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టిన అధికారులకు వెంటనే పోస్టింగ్ లు ఇచ్చి భర్తీ చేయాలి.

ఎక్సైజు శాఖలో అకారణంగా మూడు సంవత్సరాలుగా పోస్టింగ్స్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టిన అధికార్లకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలని విన్నవించారు. ఆంధ్ర నుండి తెలంగాణాకు కేటాయించిన  తెలంగాణా బిడ్డలైన 3 గురు EXCISE సూపెరింటెండెంట్స్ ఎటువంటి కారణం లేకుండా రెండు సంవత్సరాలుగా పోస్టింగ్ ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. తెలంగాణ  రాష్ట్రం వచ్చిన తరువాత అతి సుదీర్ఘ విరామం సుమారు 7 సంవత్సరాల తరువాత అన్ని శాఖలతో బాటు ఎక్సైజు శాఖలో  64 ఉన్నతాధికార్లకు పదోన్నతి ఇచ్చి అందులో 12 మంది  అధికార్లకు (ఎక్సైజు మినిస్టర్  గౌరవ అధ్యక్షులుగా ఉన్నTGO కార్యవర్గ సభ్యులకు మినిస్టర్ కులస్తులకు, నియోజకవర్గ అధికారులు) మాత్రమే పోస్టింగ్ ఇచ్చి మిగతా అధికార్లకు పోస్టింగ్ ఇవ్వకుండా అదే స్థానాలలో కొనసాగించుచున్నారు. ఇందులో భాగంగా 4 గురు  అసిస్టెంట్ కమిషనర్లను, ఒక డిప్యూటీ కమీషనర్ ని మరియు ఒక జాయింట్ కమీషనర్ ని 6 నెలలకు పైగా వెయిటింగ్ లో పెట్టి జీత భత్యాలు లేకుండా వేధిస్తున్నారని పేర్కొన్నారు.

ఉద్యోగుల పరువు పోయే విషయం ఏమిటంటే జీత భత్యాలు చెల్లించాల్సిన ప్రభుత్వం ఈ అధికారులకు బ్రతుకు వెళ్లదీయడానికి రెండు మూడు నెలలకు ఒకసారి కన్సాలిడేట్డ్ అప్పు ఏర్పాటు  చేసింది. ఉద్యోగులను వెయిటింగ్ లో పెట్టి జీత భత్యాలు ఇవ్వకుండా అప్పు తీసుకొని  బ్రతకమంటున్నారు. ఎక్సైజు శాఖకు బాధ్యుడిగా ఉన్న సోమేష్ కుమార్ మరియు సంబంధిత మినిస్టర్ కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. ఇదే విషయమై ప్రముఖ పత్రికలూ  హిందూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎన్నో సార్లు ప్రముఖంగా ప్రచురించి ప్రభుత్వం దృష్టికి తెచ్చినా సమస్య పరిష్కారం కాలేదు.

ఈ వెయిటింగ్ లో ఉన్న ఉద్యోగులకు జీత భత్యాలు లేక వారు, వారి కుటుంబ సభ్యులు నానా రకాలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి రావాల్సిన PRC  increments, premium చెల్లించక ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి. GPF చెల్లింపులు, ఇతర పొదుపు ఖాతాలు నిలిచిపోయినవి. ఎలాంటి తప్పు చేయకున్నా సామాజికంగా అవమానం ఎదుర్కొంటున్నారు. ఎక్సైజు లాంటి నేరాలను అదుపు చేసే శాఖలలో 20% అధికార్లను వెయిటింగ్ లో పెట్టి పని చేస్తున్న అధికారులకే నాలుగు అయిదు అదనపు భాద్యతలు అప్పగించడం వలన నేరాలు అదుపు లేకుండా పోయే ప్రమాదం ఉంది.

హైదరాబాద్ ఎక్సైజు సూపరింటెండెంట్ కి 3 అదనపు బాధ్యతలు రంగారెడ్డి డీసీకి 4 అదనపు బాధ్యతలు మహబూబ్ నగర్ సూపరింటెండెంట్ కు 3 అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంచుమించు శాఖలో ప్రతి ఒక్కరికి అదనపు బాధ్యతలు ఉన్నాయి. కానీ పోస్టింగ్ ఇచ్చి పని చేయించుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వులు, సర్క్యూలర్లు ఉద్యోగిని వెయిటింగ్ లో పెట్టరాదని, రిపోర్ట్ చేసిన 10 రోజులలో పోస్టింగ్స్ ఇవ్వాలని, వెయిటింగులో పెట్టినట్లు అయితే సంబంధిత అధికారి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అంతే కాకుండా సంబంధిత అధికారి జీతం నుండి వెయిటింగ్ అధికారుల జీత భత్యాలు రికవరీ చెయ్యాలని దిగువ ఉత్తర్వులు తెలియజేస్తున్నాయి.

I.Circular memo No. 5630-A/210/FR.I/2005 of Finance (FR.I) Dept Dated 16-3-2005
II.GOMs. No.48 Finance & Planning (FW.FR.I) Department Dated 24-3-1981.
III. Circular memo. 2/111/A2/ FR.I/2000 Finance (FR.I) Dept Dated 28-10-2002
IV. Cir memo N0.11854-A/233/A2/FR.I/98 Finance &PlanningFW(FR.I) Dept Dated 28-3-1998.
V.Cir. Memo No. 43877/682/A2/FR.I/96 of Finance &planning (FW.FR.I) dated 1-1-97.

ఈ ప్రభుత్వ ఉత్తరువులను ఉల్లంఘించి అతి దారుణంగా ప్రభుత్వ ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వ పరిపాలన అవసరాల దృష్ట్యా అతి తక్కువ కాలం సందర్భోచితంగా  వాడవలిసిన వెయిటింగ్ ని ఇష్టమొచ్చినట్లు వాడి ఉద్యోగులను సంవత్సరాల తరబడి వెయిటింగ్  లో పెట్టి ఉద్యోగులను  వారి కుటుంబాన్ని మానసిక, ఆర్థిక వేధింపులకు గురిచేయడానికి వాడడం  దారుణమైన విషయం అని లేఖలో రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.