తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెరాస శ్రేణులు నిరసన గళం వినిపించారు. ధాన్యం సేకరణలో కేంద్రంలోని భాజపా వైఖరిపై నిరసన తెలపాలన్న సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఊరూరా ఆందోళన చేపట్టారు. చావు డప్పులు, ర్యాలీలతో నిరసనలు వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల్లో నిరసనలతో హోరెత్తించారు. కేంద్ర ప్రభుత్వం, భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. పలుచోట్ల ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనల్లో సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మంత్రి హరీశ్‌రావు, ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్, మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఎదులాబాద్‌లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.