కేంద్ర ప్ర‌భుత్వంపై సీఎం కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్యలు

0
91

ఎరువుల ధ‌రల పెంపు విష‌యంలో కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంద‌ని ఆరోపించారు. ఎరువుల ధరలను పెంచి కేంద్రం అన్నదాతల నడ్డి విరిచిందని విమ‌ర్శించారు.

ఎరువుల ధ‌రల పెంపు విష‌యంలో పీఎం మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం ఉల్టాగా వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఈ నిర్ణయంతో బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం అని నిర్ధారణ అయిందన్నారు.

కేంద్రం చ‌ర్య‌ల‌తో రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. ఎరువుల స‌బ్సిడీ విధానాన్ని రైతుల ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా మార్చారు. 70 ఏండ్లుగా ఎరువుల‌పై స‌బ్సిడీ కొన‌సాగుతోంది. న‌రేగాతో వ్య‌వ‌సాయాన్ని అనుసంధానం చేయాల‌ని తెలంగాణ తీర్మానం చేసి పంపింది. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పంద‌న లేదు అని కేసీఆర్ పేర్కొన్నారు.

కేంద్రం తక్షణమే పెంచిన ఎరువుల ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం కుట్రలను రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకుని, పెంచిన ఎరువు ధరలు తగ్గించే వరకు బీజేపీ ప్రభుత్వంపై సాగించే పోరాటంలో కలిసి రావాలని రైతాంగానికి కేసీఆర్ పిలుపునిచ్చారు.