తిరుమల భక్తులకు గమనిక..10 రోజుల్లో అందుబాటులోకి..

0
73

తిరుమల భక్తులకు గమనిక. న‌మామి గోవింద బ్రాండ్ పేరుతో ప‌ది రోజుల్లో పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొస్తామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని డిపిడ‌బ్ల్యు స్టోర్‌లో పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీ కేంద్రాన్ని బుధ‌వారం ఈవో ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ..స‌నాత‌న హిందూ ధ‌ర్మ ప్ర‌చారంలో భాగంగా గోమాత ప్రాశ‌స్త్యాన్ని భ‌క్తుల‌కు తెలియ‌జేసేందుకు పంచ‌గ‌వ్యాల‌తో ప‌లుర‌కాల గృహావ‌స‌ర ఉత్ప‌త్తులు త‌యారు చేస్తున్న‌ట్టు తెలిపారు. కోయంబ‌త్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మ‌సీ సాంకేతిక స‌హ‌కారంతో 15 ర‌కాల ఉత్ప‌త్తులు త‌యారు చేస్తున్నామ‌ని, ప‌నులు తుదిద‌శ‌కు చేరుకున్నాయ‌ని చెప్పారు.

ఈ ఉత్ప‌త్తుల్లో హెర్బ‌ల్ సోప్‌, ధూప్ చూర్ణం, అగ‌ర‌బ‌త్తీ, హెర్బ‌ల్ షాంపు, హెర్బ‌ల్ టూత్ పౌడ‌ర్‌, విభూది, నాజిల్ డ్రాప్స్‌, హెర్బ‌ల్ పేస్ ప్యాక్‌, ధూప్ చూర్ణం, హెర్బ‌ల్ ఫ్లోర్ క్లీన‌ర్‌, ధూప్‌చూర్ణం సాంబ్రాణి క‌ప్‌, ధూప్ కోన్‌, ధూప్ స్టిక్స్‌, గో అర్కం, పిడ‌క‌లు, కౌడంగ్ లాగ్ ఉన్నాయ‌న్నారు. పంచ‌భూతాల సాక్షిగా ఐదు హోమ‌గుండాల్లో ఎంతో ప‌విత్రంగా విభూది త‌యారు చేస్తున్నామ‌ని చెప్పారు. అగ‌ర‌బ‌త్తీల త‌ర‌హాలోనే ఈ ఉత్ప‌త్తుల‌ను కూడా భ‌క్తులు ఆద‌రించాల‌ని కోరారు. ఈవో వెంట జెఈవో వీర‌బ్ర‌హ్మం, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వ‌ర‌రావు, గోశాల సంచాల‌కులు డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, ఎస్వీ ఆయుర్వేద క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ ముర‌ళీకృష్ణ త‌దిత‌రులు ఉన్నారు.

అంతకుముందు తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ గోవింద యాప్ లో కంటెంట్ కు సంబంధించి ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఫీచర్స్ పై ఈవో అధికారులతో సమీక్షించారు. ఎఫ్ఏసిఏవో బాలాజి, ఐటి సలహాదారు అమర్, ఐటి విభాగాధిప‌తి శేషారెడ్డి పాల్గొన్నారు.

అంతకుముందు టీటీడీ ఇంజినీర్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ముద్రించిన నూత‌న సంవ‌త్స‌ర డైరీని ఈవో ఆవిష్క‌రించారు. చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావుతోపాటు ఇంజినీరింగ్ అధికారులు, ప‌లువురు అసోసియేష‌న్ నాయ‌కులు ఉన్నారు.