మందు బాబులకు కిక్ ఎక్కించే న్యూస్ చెప్పింది మహారాష్ట్ర సర్కార్. ఆ రాష్ట్రంలోని మద్యం ప్రియులు ఇకపై కిరాణ దుకాణాలు, సూపర్ మార్కెట్లలోనూ వైన్ కొనుగోలు చేయొచ్చు. దీనికి మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన అధికారికంగా విడుదలైంది. 1000 చదరపు అడుగులకుపైగా విస్తీర్ణం కలిగిన కిరాణ దుకాణాలు, సూపర్ మార్కెట్లో వైన్ విక్రయాలకు అనుమతిస్తూ.. ‘షెల్ఫ్ ఇన్ షాప్’ పాలసీకి ఆమోదం ముద్ర పడింది.
వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లకు మంచి ధరలు లభించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు మైనారిటీల అభివృద్ధి శాఖ మంత్రి నవాబ్ మాలిక్. పండ్ల ద్వారా తయారు చేసిన వైన్ విక్రయాలు పెరగటం ద్వారా రైతులకు గరిష్ఠ ధరలు లభిస్తాయన్నారు. అందుకే సూపర్ మార్కెట్లు, కిరాణ దుకాణాల్లో వైన్ విక్రయాలకు అనుమతించినట్లు చెప్పారు. కొత్త పాలసీని భాజపా వ్యతిరేకించటంపై అడగగా.. అసలు భాజపాకు ఆ హక్కే లేదని తిప్పికొట్టారు మాలిక్. హిమాచల్ ప్రదేశ్, గోవా వంటి భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పాలసీలే ఉన్నాయని గుర్తు చేశారు.
అయితే ప్రార్థన మందిరాలు, విద్యా సంస్థలకు సమీపంలోని సూపర్ మార్కెట్ లోకి మాత్రం ఇందుకు అనుమతి లేదు. మద్యం నిషేధం అమల్లో ఉన్న జిల్లాల్లోనూ దీనికి అనుమతి లేదు. వైన్ అమ్మకాల కోసం లైసెన్స్ ఫీజు కింద సూపర్ మార్కెట్లు 5000 చెల్లించాల్సి ఉంటుంది. రైతులకు అదనపు ఆదాయాన్ని అందించే ఆధారిత వైన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.