ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న పార్లమెంటులో ఏపీ, తెలంగాణ విభజనపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సరిగా జరగలేదని కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఇప్పటికే ప్రధాని వ్యాఖ్యలపై అటు అధికార టిఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానిపై ఫైర్ అవుతున్నారు.
సామాజిక మాధ్యమాల్లోనూ తెరాస మద్దతుదారులు నిరసనతో హోరెత్తిస్తున్నారు. ‘మోదీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ’ పేరుతో ట్వీటర్‌లో హ్యాష్‌టాగ్‌లు పెడుతున్నారు. గంటలోపే 25 వేలకు పైగా ట్వీట్లు చేయడం గమనార్హం. తెరాస మద్దతుదారుల ట్వీట్లు ట్విట్టర్ ట్రెండింగ్‌లో రెండో స్థానంలో ఉన్నాయి.
మరోవైపు ప్రధాని వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాజ్యసభ సాక్షిగా తెలంగాణను అవమానించే విధంగా ప్రధాని మాట్లాడారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల స్ఫూర్తిదాయక పోరాటాన్ని, త్యాగాలను ప్రధాని మోదీ పదే పదే అవమానిస్తున్నారు. ప్రధాని చేసిన అసంబద్ధ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ వ్యాఖలపై తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నానని ట్విట్టర్ లో తెలిపారు.