పార్శిల్ ఓ వ్యక్తి జీవితానికి శాపంగా మారింది. తెలిసిన వారు ఇచ్చిన పార్శిల్ తీసుకెళ్లిన పాపానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 19 ఏళ్లు జైలు జీవితం గడిపేలా చేసింది. విదేశాలకు వెళ్లే తన లాంటి వారికి తన జీవితంలో జరిగిన ఈ చేదు ఘటన ఓ గుణపాఠం కావాలంటున్నాడు హమీద్. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
అసలేం జరిగిందంటే..
సౌదీ అరేబియాలో ఉంటున్న షాహుల్ హమీద్ 2003లో తన హాలీడేస్ పూర్తి చేసుకుని స్వస్థలమైన చెన్నై నుంచి సౌదీకి బయల్దేరాడు. అయితే, చెన్నైకి చెందిన కొందరు తెలిసిన వాళ్లు హమీద్‌ను సౌదీలో ఉండే తమ వారి కోసం ఓ పార్శిల్ తీసుకెళ్లాల్సిందిగా చెప్పారు. వారు ఇచ్చిన పార్శిల్‌ను హమీద్ తన లగేజీలో పెట్టుకున్నాడు. ఆ పార్శిల్ లో ఏముంది అనేది పట్టించుకోని హమీద్ చెన్నై నుంచి బహ్రెయిన్ మీదుగా సౌదీ వెళ్లేందుకు విమానం ఎక్కాడు. ఇక విమానం బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే తన దగ్గర ఉన్న పార్శిల్ లో ఏముందో తెలియని హమీద్ అధికారుల తనిఖీల్లో ఖంగు తిన్నాడు. హమీద్ లగేజీలో ఉన్న పార్శిల్‌లో మత్తు పదార్థాలు బయటపడ్డాయి. దీనితో హమీద్ షాక్ తిన్నాడు. ఆ పార్శిల్ తనది కాదని, తెలిసిన వారు ఇస్తే తీసుకొచ్చానని చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా బహ్రెయిన్ న్యాయస్థానం హమీద్‌కు యావజ్జీవకారాగార శిక్ష విధించింది. దీంతో గత 19 ఏళ్లుగా అతడు బహ్రెయిన్ జైలులోనే మగ్గుతున్నాడు.
అయితే ఈ క్రమంలో హమీద్‌ను తీవ్ర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దాంతో బహ్రెయిన్ అధికారులు మానవత దృక్పథంతో అతడిని విడుదల చేసేందుకు అంగీకరించారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన హమీద్ బుధవారం స్వదేశానికి పయనమయ్యాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హమీద్.. తన పట్ల కనికరం చూపించిన కింగ్‌డమ్ పాలకులు, అధికారులతో పాటు తన విడుదల కోసం తీవ్రంగా శ్రమించిన భారత ఎంబసీ, సామాజిక కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇది తనకు చాలా బిగ్ రిలీఫ్ అని పేర్కొన్న హమీద్.. ఈ మధురమైన క్షణాల కోసం స్వదేశంలో ఉన్న తన భార్య షకీనా షాహుల్ హమీద్, ఇద్దరు కుమారులు, కూతురు, తల్లి గత 19 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపాడు. ఈ 19 ఏళ్లలో తన జీవితం, కుటుంబంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని, తన తండ్రిని కూడా కోల్పోయినట్లు వాపోయాడు. విదేశాలకు వెళ్లే తనలాంటి వారికి తన జీవితంలో జరిగిన ఈ చేదు ఘటన ఓ గుణపాఠం లాంటిదని ఈ సందర్భంగా షాహుల్ హమీద్ చెప్పుకొచ్చాడు.