ఉక్రెయిన్‌పై వార్‌..రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఊహించని షాక్‌

0
114

దేశంలోకి దూసుకొస్తున్న రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్‌ బలగాలు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. ఉక్రెయిన్‌ రాజధాని కైవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు హై స్పీడ్‌ వేగంతో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా తీరుపై ఇప్పటికే ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఉక్రెయిన్​పై సైనిక చర్యలకు దిగిన రష్యాపై ఐరోపా, అమెరికా సహా పలు ఆసియా పసిఫిక్​ దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.

తాజాగా ఉక్రెయిన్​పై సైనిక చర్యలకు దిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) ఆంక్షలు విధించింది. పుతిన్‌, రష్యా విదేశాంగశాఖ మంత్రి లావ్రోవ్‌ ఆస్తులను ఫ్రీజ్‌ చేస్తున్నట్టు ఈయూ వెల్లడించింది. మరోవైపు ఉక్రెయిన్‌ అధికారులతో చర్చలకు పుతిన్‌ సిద్దంగా ఉన్నారని రష్యా అధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. చర్చల కోసం బెలారస్ రాజధాని మిన్‌స్క్‌కు రష్యా ఓ బృందాన్ని పంపనున్నట్టు పేర్కొంది.

ఉక్రెయిన్‌పై ముప్పేట దాడి చేయాలని రష్యా తొలుత ప్రణాళిక రచించింది. శరవేగంగా ఆక్రమణ సాగాలని భావించింది. అయితే ఉక్రెయిన్‌ బలగాల దృఢ ప్రతిఘటనతో గడిచిన 24 గంటల్లో రష్యా పోరు మందగమనంలో సాగుతోంది. ఇప్పటివరకూ ఒక్క నగరాన్ని కూడా పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోలేకపోయింది.