గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఆగ్నేయా మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, మరఠ్వాడా మీదుగా ఉపరితల ద్రోని ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వార్త ప్రజలకు ఎండ నుండి ఉపశమనం కలిగిస్తుంది.
మరోవైపు రాష్ట్రంలో వర్షాలు కురిస్తే భారీగా పంట నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వరి కోతదశలో ఉంది. మామిడి చెట్లు కూడా పిందెలతో ఉన్నాయి. ఇలాంటి సమయంలో గాలులతో కూడిన వర్షాలు పడితే నష్టం చేకూరే అవకాశం ఉంది.