శ్రీవారి కానుకల లెక్కింపులో లేటెస్ట్ టెక్నాలజీ.. భ‌క్తులు ప్ర‌త్య‌క్షంగా వీక్షించేలా ఏర్పాట్లు..

0
99

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజు భక్తులు బారులు తీరుతారు. తమ మొక్కులో భాగంగా దేవునికి కానుకలు సమర్పిస్తుంటారు. ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు ఎన్నో కానుకలు హుండీలో వేస్తుంటారు. వీటిని డైలీ లెక్కించి టీటీడీ వివరాలు వెల్లడిస్తుంది. హుండీలో సమర్పించే కానుకలు లెక్కించేందుకు టీటీడీ తాజాగా కొత్త టెక్నాలజీని వాడబడుతోంది. అత్యాధునిక ప‌ర‌కామ‌ణి భ‌వ‌నాన్ని త్వ‌ర‌లోనే అందుబాటులోకి తీసుకురానుంది. తిరుమ‌ల‌లోని అన్న ప్ర‌సాద కేంద్రానికి ఎదురుగా కొత్త పరకామణి నిర్మాణ ప‌నులను శ‌ర‌వేగంగా పూర్తి చేయబోతోంది.

భ‌క్తులు కానుక‌ల లెక్కింపు ప్ర‌త్య‌క్షంగా వీక్షించేలా బుల్లెట్ ప్రూఫ్ అద్దాల‌ను అమ‌ర్చుతారట.‌ నాణేల లెక్కింపు స‌మ‌స్య‌ను అధిగమించేందుకు టెక్నాలజీని సాయంతో.. అత్యాధునిక యంత్రాల‌ను కొత్త ప‌ర‌కామ‌ణికి అందుబాటులో తీసుకురానున్నారు.. ఇప్పటిదాకా శ్రీవారి ఆలయంలోని గర్భ గుడి వెనుక ప్రాకారంలో ఉన్న ప‌ర‌కామ‌ణి కానుకల లెక్కింపు ఇబ్బందిగా మారడంతో టీటీడీ కొత్త ఆలోచన చేసింది. వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తులు సమర్పించే ముడుపులు హుండీ ద్వారా టీటీడీకి ఆదాయం సమకూరుతుండగా కోట్లాది రూపాయల నోట్లు, నాణ్యాలు లెకింపులో సిబ్బంది ఇబ్బంది పడుతుండటంతో టీటీడీ 10 కోట్ల రూపాయలతో పరకామణి సిద్ధం చేస్తోంది.

భక్తులు సమర్పించే కానుకలతో రోజుకు 9 నుంచి 13సార్లు నిండుతున్న హుండీలోని కానుకలను ప‌ర‌కామ‌ణి లెక్కించే సిబ్బంది నోట్లు, నాణేలు, విదేశీ క‌రెన్సీని వేరు చేసి లెక్కిస్తారు. సూర్య గ్ర‌హ‌ణం, చంద్ర గ్ర‌హ‌ణం రోజుల్లో మిన‌హా మిగిలిన అన్నీ రోజుల్లో ఉద‌యం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు హుండీ లెక్కింపు జరుగుతోంది. హుండీ లెక్కింపులో టీటీడీ సిబ్బంది, వివిధ బ్యాంకుల‌కు చెందిన ఉద్యోగులతోపాటు ప‌ర‌కామ‌ణి సేవలో పాల్గొనేందుకు ఆస‌క్తి ఉన్న ప్ర‌భుత్వ ఉద్యోగులు, ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఉద్యోగులు టీటీడీ వెబ్ సైట్ లో రిజిస్ట‌ర్ చేసుకుని హుండీ లెక్కింపులో పాల్గొనే అవకాశం ఉంది. ఇలా 250 మందికి పైగా రోజూ రెండు షిప్టుల్లో ప‌ర‌కామ‌ణిలో హుండీ లెక్కింపులో పాల్గొంటారు. దీంతో ప్రస్తుతం ఉన్న పరకామణి సిబ్బందికి అనువుగా లేకపోవడం, కానుకల లెక్కింపు ఆలస్యంగా సాగుతుండడం.. గాలి వెలుతురు ఇబ్బందిగా ఉండటంపై ఇబ్బందిగా మారుతోంది.