వడ్లు కొనకుండా టీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలు చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో పండించిన చివరి గింజకొనిపించే వరకు రైతుల పక్షాన రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటానికి కాంగ్రెస్ పార్టీ దిగుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన హెచ్చరించారు. ఈ ఉద్యమంలో రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా పాల్గొంటారని తెలిపారు. కాగా రాహుల్ గాంధీ ఇప్పటికే ధాన్యం కొనుగోలుపై తెలుగులో ట్వీట్ చేయగా కవిత, హరీష్ రావు కౌంటర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
“కేంద్రం కొంటలేదు కాబట్టి వరి వద్దంటే..కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది ఎందుకని రేవంత్ ప్రశ్నించారు. కేంద్రం కొంటే నీ ప్రభుత్వం దళారి పని చేస్తుందా, ప్రతిగింజ కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది” అని రేవంత్ పేర్కొన్నారు.. కేటీఆర్ కు చరిత్రపై అవగాహన లేదు. హరిత విప్లవం నుంచి ఉచిత విద్యుత్, రుణ మాఫీ అన్నీ కాంగ్రెస్ వే అన్నారు. కేంద్రం ఉన్నపళంగా మనసు మార్చుకొని వడ్లు కొంటామన్నా అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు.
కేసీఆర్ ముందు చూపు లేకుండా బాయిల్డ్ రైస్ ఇవ్వమని కేంద్రానికి ఇచ్చిన లేఖ ఇప్పుడు తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ఈ లేఖ చూపిస్తూ బాయిల్డ్ రైస్ తీసుకునే ప్రసక్తి లేదని స్పష్టంగా చెబుతుంది. ఈ విషయంలో మాట్లాడటానికి ఢిల్లీకి వచ్చే మంత్రులకు ఇక్కడ ఎవరూ విలువ ఇవ్వడం లేదు. ఎంపీలేమో సెంట్రల్ హాల్లో ఫోటోలకు ఫోజులిస్తూ పోరాడుతున్నామని నాటకామాడుతున్నారు. ఇంత తీవ్రమైన అంశం మీద మాట్లాడానికి వచ్చే కేటీఆర్, కవిత, హరీష్ రావు ఎందుకుండరు. నేను బతికుండగా రైతులకు కష్టం వచ్చే ప్రసక్తే లేదని కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మరీ రైతులు ఇంత కష్టాల్లో ఉంటే కేసీఆర్ ఏమి చేస్తున్నాడు. ప్రధానితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించవచ్చు. కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపెట్టేందుకు , రైతులను ఫణంగా పెడుతున్నారు. రైతుల పట్ల కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే, జంతర్ మంతర్ లో ఆమరణ దీక్ష చేయాలి. అందుకు కావాల్సిన ఏర్పాట్లను కాంగ్రెస్ చేస్తుంది. రూ.10 వేల కోట్లు ఇస్తే ప్రతి గింజ కొని చూపిస్తాం.
అందరిని వద్దని కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్లో 150 ఎకరాల్లో వరి పండించారు. కేసీఆర్ వరి కొనే వాళ్లు పేద రైతుల వడ్లు కొనరా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి రూ.10 వేల కోట్లు కేటాయిస్తే కనీస మద్దతు ధరకు తెలంగాణలో ప్రతి గింజను కొని చూపిస్తామన్నారు. ఈ సీజన్లో దాదాపు వచ్చే ధాన్యంలో రా రైస్ పొగా మిగిలిన నూకలను టన్నకు రూ. 2 వేలకు అమ్ముకున్నా రూ. 1000 కోట్ల నష్టం మాత్రమే వస్తుంది. రూ. 2.5 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో ఈ రూ.1000 కోట్లు భరించ లేదా ఈ ప్రభుత్వం. ధాన్యం కొనుగోలు చేయని పక్షంలో ఇక రూ.వేల కోట్లతో ప్రాజెక్టులు నిర్మించడమెందుకు… రైతు బంధు ఎందుకని నిలదీశారు. ఏం పంటను కొనుగోలు చేయకపోతే ఇక ప్రభుత్వమెందుకు అని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీబచేసిన ట్వీట్ పై టీఆర్‌ఎస్ నేతలు పోటీ పడి కామెంట్స్ చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా చేసిన సూచనలు పరిగణలోకి తీసుకుంటారని భావించాం. కానీ కేటీఆర్ ఎదురు దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ ఏమి చేసిందని ప్రశ్నిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ చరిత్ర, దేశ చరిత్రపై ఎలాంటి అవగహన లేదని విమర్శించారు. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ అనుభవిస్తున్న తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ‘‘కేటీఆర్.. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎంతగా పాటుపడిందో పాపం మీకు తెలియదేమో. కాంగ్రెస్ చేసిందేంటో మీ నాయన కేసీఆర్ ను అడగండి చెబుతారు. అయినా, రైతుల సమస్యలను పరిష్కరించకుండా రాజకీయం చేయడంలో ఆయన బిజీగా ఉండి ఉంటారు’’ అని రేవంత్ పేర్కొన్నారు. రైతుల కోసం కాంగ్రెస్ ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిందని, దేశంలో హరిత విప్లవం తీసుకొచ్చిందీ కాంగ్రెసేనని తెలంగాణ రేవంత్‌రెడ్డి అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ను ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఒకే సంతకంతో దేశంలోని రైతులు 70 వేల కోట్ల రూపాయలను మాఫీ చేసింది.
సకాలంలో బకాయిలు చెల్లించిన రైతులకు రుణ మాఫీతో లబ్ధి జరగలేదని గ్రహించి, 36 లక్షల మంది రైతులకు ఐదు వేల రూపాయల చొప్పున రూ. 1,800 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీ చేసి రైతు కుటుంబాలను ఆదుకుంది కాంగ్రెస్ అని అన్నారు. ఎన్నో సవరణలు చేసి పంటలకు మద్దతు ధర కల్పించామని, ప్రాణహిత చేవెళ్ల పేరు మార్చి రకరకాల పేర్లతో దోపిడీ చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ వంటి ప్రాజెక్టులు, ఆహార భద్రత చట్టం, ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, సీలింగ్ యాక్ట్, పంటలకు మద్దతు ధర, భూముల సీలింగ్ యాక్ట్, మార్కెట్ వ్యవస్థ వంటి ఎన్నో విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 7 వేల మంది రైతులను పొట్టనబెట్టుకుందని మండిపడ్డారు.
ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి మీద కేటీఆర్, కేసీఆర్ ఎవరితోనైనా చర్చకు సిద్ధమే అని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ గొప్ప ఎక్కడ ఉన్నాయో చూపించాలి అంటూ గతంలో కేటీఆర్ సవాలు విసిరారు. ఆ సవాలుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్ గఢ్ లో బోనస్ ఇచ్చి మరి రూ. 2500లకు వడ్లను కొనుగోలు చేస్తున్నారని మేము బదులు ఇస్తే కేటీఆర్ నుంచి ఇంతవరకు ఎటువంటి ఉలుకు లేదు పలుకు లేదని రేవంత్ పేర్కొన్నారు.