క్రెడిట్​ స్కోర్​ తగ్గిపోయిందా? ఇలా ఎందుకు జరుగుతుందంటే..

0
104

ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డు​ వాడే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. క్రెడిట్‌ కార్డులను సరిగా ఉపయోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. రోజువారీ ఖర్చులపై రాయితీ కూడా పొందొచ్చు. చాలా సందర్భాలకు ఒకే కార్డు అవసరమైనప్పటికీ.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ కార్డులు ఉండడం అదనపు ప్రయోజనాన్ని కల్పిస్తాయి. కానీ వీటి వల్ల నష్టాలు కూడా ఉన్నాయి.

ఒక వ్యక్తి ఆర్థిక విషయాల్లో ఎంత క్రమశిక్షణతో ఉన్నారో క్రెడిట్‌ స్కోరు వెల్లడిస్తుంది. కావాల్సినప్పుడు వెంటనే రుణాలు పొందాలంటే ఈ స్కోరు మీకు ఒక అస్త్రంగా పనిచేస్తుంది. కీలకమైన ఈ క్రెడిట్‌ స్కోరు కొన్నిసార్లు తగ్గిపోతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది.

క్రెడిట్‌ స్కోరు తగ్గిపోయిందని గుర్తించిన వెంటనే నివేదికను ఒకసారి పరిశీలించండి. కొత్తగా మీకు తెలియకుండా ఏదైనా అప్పు మీ ఖాతాలో చేరిందా చూసుకోండి. తీసుకున్న రుణాలకు వాయిదాల చెల్లింపు ఆలస్యమయ్యిందా? క్రెడిట్‌ కార్డు బిల్లు మొత్తం చెల్లించారా చూసుకోండి.

సాధారణంగా ఈఎంఐలను ఆలస్యంగా చెల్లించినా.. లేదా చాలా కాలంగా వాటిని పట్టించుకోకపోయినా.. క్రెడిట్‌ స్కోరు తగ్గిపోతుంది. ఒకసారి ఈఐఎంని సకాలంలో చెల్లించకపోతే.. తర్వాత దీనిని క్రమం తప్పకుండా చెల్లించడం ద్వారా స్కోరును సరిచేసుకోవచ్చు. ఎప్పుడూ ఆలస్యం చేస్తుంటే.. స్కోరును పెంచుకోవడం కుదరని పని. సమయానికి చెల్లించడం అనేది మీ చేతిలో పనే. దీన్ని పట్టించుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.