తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం రైతుబంధు, రైతుభీమా. ఈ పథకాల ద్వారా అనేక రైతులు లబ్ది పొందుతున్నారు. పెట్టుబడి సాయంగా ఒక్క సీజన్ కు ఎకరానికి 5 వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తుంది సర్కార్.
ఇక రైతుభీమా కూడా కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంది. ఒక గుంట భూమి ఉన్న రైతు కూడా ఏదో కారణంతో మరణిస్తే వారికి 10 రోజుల్లోనే రూ.5 లక్షలు అందిస్తుంది. అయితే చాలా మంది రైతులు నూతనంగా పాస్ పుస్తకాలు వచ్చాయి. అలాంటి వారికీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 1 వరకు దరఖాస్తుల స్వీకరణకు నిర్ణయించింది.
ఈ పథకం కింద 18 నుంచి 59 ఏళ్ల వయసు గల రైతులకు జీవిత బీమా కల్పించడానికి ప్రీమియం చెల్లిస్తుంది. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది (2022) జూన్ 22 వరకూ కొత్తగా భూములు కొని పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారిలో 18 నుంచి 59 ఏళ్ల వయసు గల వారు తమ భూమి ఉన్న గ్రామ ‘వ్యవసాయ విస్తరణ అధికారి’(ఏఈఓ)కి దరఖాస్తు ఇవ్వాలి. తద్వారా వారికి 2022 ఆగస్టు 14 నుంచి ఏడాది పాటు జీవిత బీమా ఉంటుంది. ఏదైనా కారణంతో రైతు మరణిస్తే అతని కుటుంబానికి రూ.5 లక్షలు జీవిత బీమా పరిహారం కింద అందజేస్తారు.