గట్టుప్పల్ లో సీఎం కేసీఆర్ కు కృతజ్ఞత సభ..భారీగా ఏర్పాట్లు

0
42

తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొత్త మండలాలను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ నూతన జిల్లాలను, రెవిన్యూ డివిజన్లను, మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే అనేక చోట్ల మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ప్రజల నుంచి తలెత్తడంతో మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎంఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్త మండలాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. మండల ఏర్పాటు కల సాకారం చేసినందుకు మునుగోడులోని గట్టుప్పల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞత సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ..గట్టుప్పల్ ను మండలంగా ఏర్పాటు చేసిన నేపధ్యంలో అక్కడి ప్రజలు ఈ మంగళవారం పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞత సభ నిర్వహించేందుకు నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోటే తమ కలలు సాకారం అయ్యాయని అందుకే కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ముఖ్య అతిధిగా రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాజరు కానున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు.

గట్టుప్పల్ మండల కేంద్రంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నిర్వహించ తల పెట్టిన ఈ కృతజ్ఞత సభను విజయవంతం చేసేందుకు గాను మండల ప్రజలతో పాటు మునుగోడు నియోజకవర్గ ప్రజలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రోజున మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో గట్టుప్పల్ మండల సాధన కమిటీ కన్వీనర్ ఇడెం కైలాసం గులాబీ గూటికి చేరిన విషయం విదితమే. కోలాటాలు, ధూమ్ ధామ్ లతో మండల ఏర్పాటు సంబరాలు అంబరాన్ని అంటే రీతిలో జరపనున్నట్లు నియోజకవర్గ టిఆర్ యస్ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు.