ఆసియా కప్ లో భాగంగా నిన్న జరిగిన పాక్-ఇండియా మ్యాచ్ లో హార్దిక్ ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. బౌలింగ్, బ్యాటింగ్ తో ఇండియాను విజయ తీరాలకు చేర్చాడు. హార్దిక్ పాండ్య (3/25), భువనేశ్వర్ (4/26) విజృంభించడంతో మొదట పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. జడేజా (35; 29 బంతుల్లో 2×4, 2×6), హార్దిక్ పాండ్య (33 నాటౌట్; 17 బంతుల్లో 4×4, 1×6)ల అద్భుత భాగస్వామ్యంతో లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఉత్కంఠగా చివరి ఓవర్..
చివరి ఓవర్లో ఏడు పరుగులు చేయాల్సిన పరిస్థితి. పైగా బౌలర్ స్పిన్నర్ నవాజ్. కానీ కథ అంత తేలిగ్గా ముగియలేదు. తొలి బంతికే భారీ షాట్ ఆడబోయి జడేజా బౌల్డ్ కావడం, తర్వాతి రెండు బంతుల్లో ఒక్క పరుగే రావడంతో ఉత్కంఠ తీవ్రమైంది. కానీ నాలుగో బంతికి లాంగాన్‌లో సిక్స్ కొట్టిన హార్దిక్.. పాక్ ఆశలపై నీళ్లు చల్లాడు. భారత్‌ను సంబరాల్లో ముంచెత్తాడు.
పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో భారత్ పడగొట్టిన పది వికెట్లూ పేసర్ల ఖాతాలోనే చేరాయి. భువనేశ్వర్ 4 వికెట్లు తీయగా.. హార్దిక్ మూడు, అర్ష్‌దీప్ రెండు వికెట్లు పడగొట్టారు. అవేష్ ఖాన్ ఒక వికెట్ తీశాడు. ఒక టీ20 మ్యాచ్‌లో మొత్తం పది వికెట్లూ భారత పేసర్ల ఖాతాలో చేరడం ఇదే తొలిసారి.