ప్రయాణికులకు బిగ్ అలెర్ట్..విజయవాడ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకల్లో మార్పులను అధికారులు ప్రకటించారు. ఈ మార్పులకు కారణాలు ఏంటంటే..ఖమ్మం జిల్లా కొండపల్లి- రాయనపాడు రైల్వేస్టేషన్ల మధ్య జరుగుతున్న మూడోలైను పనుల కారణంగా కాజీపేట మీదుగా విజయవాడ వైపు వెళ్లే రైళ్ల రాకపోకల సమయాలు మారాయని అధికారులు ఈ మేరకు తెలియజేసారు. సెప్టెంబరు 20 వరకు ఈ మార్పులు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.
విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకల్లో పలు కీలక మార్పులివే..
సికింద్రాబాద్-గుంటూరుల మధ్య నడిచే 17201/72 గోల్కొండ ఎక్స్‌ప్రెస్ మధిర వరకు, కాజీపేట- విజయవాడల మధ్య నడిచే ప్యాసింజరు రైలు ఖమ్మం వరకే ప్రయాణిస్తుంది. కాజీపేట- తిరుపతి మధ్య నడిచే(07091/92) తిరుపతి ప్రత్యేక రైలును ఆగస్టు 3, సెప్టెంబరు 6, 13, 20 తేదీల్లో రద్దు చేశారు.
కాజీపేట మీదుగా విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లను నడికుడి మీదుగా దారి మళ్లించారు. వీటిలో విశాఖ-సికింద్రాబాద్‌ల మధ్య నడిచే 12739/40 గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్- గుంటూరుల మధ్య నడిచే 12705/06 ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, 12787/88 నాగర్‌సోల్, 12775/76 గౌతమి రైళ్లున్నాయి. ఇంకా విశాఖ షిర్డీ, టాటానగర్, సికింద్రాబాద్-తిరుపతి, హైదరాబాద్-తిరుపతి, మచిలీపట్నం రైళ్లను కూడా నడికుడి మీదుగా దారి మళ్లించారు.