కాంగ్రెస్ టు బీజేపీ..రెబల్ స్టార్ రాజకీయ ప్రస్థానం ఇలా..

0
132

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు తెల్లవారుజామున ఆయన కన్నమూశారు. రెబల్ స్టార్ మృతితో కుటుంబీకులు, ఫ్యాన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలను పోషించారు కృష్ణంరాజు. సినిమా ఇండస్ట్రీ నుండి రాజకీయాల వైపు అడుగేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

రాజకీయ ప్రస్థానం ఇలా..

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 1940 జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు.. తెలుగు చిత్రసీమలో రెబల్‌ స్టార్‌గా పేరొందారు.  ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ప్రయాణించిన ఆయన వాజ్​పేయి హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు.

ఏపీలోని కాకినాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున తొలిసారి ఏంపీగా గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. 1998 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 42 స్థానాలకు గానూ బీజేపీ నాలుగు స్థానాల్లో గెలవగా.. అందులో కాకినాడ నుంచి కృష్ణం రాజు గెలిచారు.

కృష్ణంరాజు రాజకీయ ప్రస్థానం బీజేపీతోనే ప్రారంభంమైందని అందరూ అనుకుంటారు. కాని కృష్ణం రాజు రాజకీయ ప్రస్థానం తొలుత కాంగ్రెస్ తో ప్రారంభమైంది. 1990లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత 1991లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు.తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయ్ కుమార్ రాజు చేతిలో ఓటమి చెందారు. కృష్ణంరాజుకు 2,59,154 ఓట్లు రాగా.. టిడిపి అభ్యర్థి విజయ్ కుమార్ రాజుకు 3,17,703 ఓట్లు వచ్చాయి. ఆఎన్నికల్లో సానుకూల ఫలితం రాకపోవడంతో కృష్ణంరాజు కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆతర్వాత బీజేపీ నుంచి ఆహ్వానం అందటంతో ఆయన కమలం పార్టీలో చేరారు.