అనుకున్నట్టుగానే ఇండియా-ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్ రసవత్తరంగా సాగింది. భారత్ ఏకంగా 200 పైచిలుకు స్కోర్ చేసింది. అయినా ప్రత్యర్ధులు ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. కొండంత స్కోర్ ను కరిగిస్తూ విజయాన్ని చేరుకున్నారు. అయితే మొదటి టీ20 పరాజయం తర్వాత ఇప్పుడు రెండో మ్యాచ్ పై దృష్టి పెట్టింది ఇండియా.
మొదటి మ్యాచ్ లో బ్యాటర్లు భారీ స్కోర్ అందించారు. అయితే బౌలింగ్, ఫీల్డింగ్ తప్పిదాలు ఇండియా కొంప ముంచాయి. ఒకవేళ ఆస్ట్రేలియా బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్ లు పట్టుంటే పరిస్థితి వేరుగా ఉండేది. ముఖ్యంగా డెత్ ఓవర్ స్పెషలిస్ట్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.
ఇక రెండో మ్యాచ్ కు బూమ్ బూమ్ బుమ్రా జట్టుతో కలవడం కొండంత బలం. ఇక దినేష్ కార్తీక్ కు మరో ఛాన్స్ ఇస్తారా? లేక పంత్ కు తుది జట్టులో చోటు కల్పిస్తారా అన్నది చూడాలి. అయితే అక్షర్, చాహల్ లో ఒకరిని తప్పించి అశ్విన్ ను తీసుకుంటారనడంలో సందేహం లేదు. కాగా ఉమేష్ యాదవ్ స్థానంలో బుమ్రా రానున్నట్లు తెలుస్తుంది.
ఇక ఆస్ట్రేలియా జట్టులో ఫించ్, గ్రీన్, మాక్స్ వెల్, స్మిత్, డేవిడ్, వేడ్ కీలకంగా మారనున్నారు. వీరు రాణిస్తే ఇండియాకు కష్టమే. అయితే బౌలింగ్ లో హేజిల్ వుడ్, కమ్మిన్స్ అంతగా ప్రభావం చూపలేకపోయారు. కాగా ఆస్ట్రేలియా జట్టుకు వార్నర్, మిచెల్ మార్ష్, స్టార్క్ దూరం కావడం అతి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు.
అయితే టీ20లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. గెలిచే జట్టు ఓడిపోవచ్చు. లేదా ఓడిపోయే జట్టు విజయ తీరాలకు చేరుకోవచ్చు. కాబట్టి ఏ జట్టును తక్కువ అంచనా వేయలేం.