కనిపించని దేవుడు కంటే కనిపించే వైద్యుడే దేవుడని నమ్మే వారి నమ్మకాలు వమ్ము చేసే విధంగా వ్యవహరిస్తున్నారా అని అనుమానం రాకమానదు ఈ సంఘటన తెలిస్తే. గర్భిణీకు డెలివరీ చేసిన వైద్య సిబ్బంది, బొడ్డుపేగుకు బదులు శిశువు చిటికెన వేలు కోసేశారు. ఈ దారుణమైన ఘటన మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. తప్పును గమనించుకున్న సిబ్బంది వెంటనే శిశువు వేలుకు కట్టుకట్టి, హుటాహుటిన గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. నవజాత శిశువుల పట్ల మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని బాధిత కుటుంబసభ్యులు వైద్యులను ప్రశ్నించారు. ఘటనపై స్పదించిన ఉన్నతాధికారులు ఘటనకు బాధ్యురాలైన వైద్యులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ చేసినంత మాత్రాన జరిగిన ఘోరానికి న్యాయం జరిగినట్లేనా, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా బాధ్యులను డిస్మిస్ చేయాలంటూ ఉన్నతాధికారులను కోరుతున్నారు.