Nizamabad : కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడు.. కుమార్తె వరుస అయ్యే ఆరేళ్ల చిన్నారి పట్ల మృగంలా ప్రవర్తించాడు. అభంశుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడుతున్న చిన్నారి పట్ల కనీసం జాలి చూపకుండా.. తలపై రాయితో కొట్టి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. తీవ్రగాయాలతో చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారిని పోస్టుమార్టం చేస్తే.. ఎక్కడ తన భండారం బయటపడుతుందోనని.. పోస్టుమార్టం చేయనీయకుండా చేసేందుకు శతవిధాల ప్రయత్నించాడా నిందితుడు. చివరకు నిజం తెలియటంతో, పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ ఘటన నిజామాబాద్ (Nizamabad) జిల్లా డిచ్ పల్లిలో జరిగింది.
కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళ, భర్తను కోల్పోయి.. ఆరేళ్ల కూతురితో కలిసి ఉంటోంది. వ్యవసాయ కూలీగా పనిచేసే సదరు మహిళ.. ఇటీవలే డిచ్ పల్లి మండలంలోని ధర్మారం గ్రామానికి నాలుగు నెలల క్రితం వలస వచ్చింది. ఈ క్రమంలో అక్కడే ఉంటున్న గోవింద్ రావుకు, ఒంటరి మహిళకు పరిచయం ఏర్పడింది. ఆమె అవసరాన్ని అలుసుగా తీసుకొని, మాయమాటలతో ఆమెను లోబర్చుకున్నాడు. కానీ, ఆమె మెుదటి భర్త ద్వారా పుట్టిన పిల్లలు తనకు అడ్డుగా భావించాడు. దీంతో వారం రోజుల క్రితం ఆరేళ్ల వయస్సు ఉన్న బాలికపై గోవిందరావు అత్యాచారానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావంతో చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో.. ఆమె తలపై రాయితో కొట్టి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
కుమార్తె అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన తల్లి.. నిజామాబాద్ ఆసుపత్రికి తరలించింది. చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో ప్రియుడుతో కలిసి, కుమార్తెను హైదారబాద్‌కు తీసుకువెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. కానీ బాలిక మృతదేహానికి పోస్టుమార్టం చేస్తే.. అత్యాచార విషయం బయటపడుతుందని గోవిందరావు భయపడ్డాడు. దీంతో బాలికది సహజమరణమేనని తల్లిని ఒప్పించి, మృతదేహాన్ని తీసుకువెళ్లిపోవటానికి ప్రయత్నించాడు.
ఆసుపత్రి యాజమాన్యం అప్పటికే డిచ్ పల్లి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో.. పోలీసులు ఆసుపత్రికి చేరుకొని.. బాలిక మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టంలో బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో బాలిక తల్లితోపాటు.. గోవిందరావును పోలీసులు విచారణ చేయటంతో నిందితుడు అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో గోవిందరావుపై ఫోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Read also: జనసైనికులను ఇబ్బందులు పెట్టేలా వైసీపీ కుట్ర