TDP leader Pattabiram sensational comments on YCP minister and MLA: రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొని, వైసీపీ నేతలే విదేశాలకు ఎగుమతి చేస్తున్నారంటూ టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి.. వైసీపీ నేతలు కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతులు చేసి కోట్లు కొల్లగొడుతున్నారని అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేషన్ బియ్యం దందాలో రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలదే కీలక పాత్ర అని విమర్శలు గుప్పించారు.
పేదల నుంచి కిలో రేషన్ బియ్యాన్ని రూ. 7-10కి కొనుగోలు చేసి.. రెండు మూడు రెట్ల లాభానికి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని పేర్కొన్నారు. అందులో కొంతభాగం తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుతుందని వ్యాఖ్యానించారు. అందరూ తలా కొంచెం పంచుకోవటం వల్లే రాష్ట్రం నలుమూలల నుంచి రేషన్ బియ్యం రాచమార్గంలో కాకినాడకు చేరుతున్నాయని పట్టాభి ఆరోపించారు. రాష్ట్రంలో బియ్యం ఉత్పత్తి పెరగలేదు కానీ.. ఎగుమతులు మాత్రం అసాధారణంగా పెరిగాయనీ.. ఈ అసాధారణ పరిస్థితి రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొని విదేశాలకు ఎగుమతి చేయటం వల్లనే సంభవించిందన్నారు. మంత్రి కారుమూరి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి బియ్యం బకాసురుల్లా మారి ఈ అక్రమ దందా నడిపిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. వైసీపీ పెద్దలందరూ ఈ అక్రమ రేషన్ బియ్యం ఎగుమతిలో భాగం పంచుకోవటంతోనే ఇది అధికారిక స్మగ్లింగ్‌గా మారిపోయిందని పట్టాభి వ్యాఖ్యానించారు.