Kasani Gnaneswar took oath as ttdp president in the presence of chandrababu: తెలంగాణ T-TDP అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ గురువారం ప్రమాణం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం NTR ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం గన్ పార్క్ అమరవీరుల స్థూపం వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన కాసాని.. అనంతరం ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రమాణం చేశారు.
కాసాని ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. టీడీపీ వెనుకబడిన వర్గాల పార్టీ అని, తెలంగాణలో వెనుకబడిన వర్గాలు తమకు ఓ వేదిక కోసం ఎదురు చూస్తున్నాయని, టీడీపీ మాత్రమే వారందరికీ న్యాయం చేసే వేదిక అని పేర్కొన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ పదవులకే వన్నె తీసుకు వచ్చిన వ్యక్తి అని కొనియాడారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు దేశం పార్టీ ఉంటుందని.. తెలంగాణ ప్రజలు టీడీపీని ఆశీర్వదించాలని చంద్రబాబు నాయుడు కోరారు.
కాసాని మాట్లాడుతూ.. భవిష్యత్తులో తెలంగాణలో టీడీపీ(T-TDP) అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేదలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పని చేస్తానని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని బలంగా చెప్పారు. సబ్బండ వర్గాలు తెలుగు దేశం వైపు చూస్తున్నాయని, అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్తానని చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు.
ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ తెలంగాణలో క్రమక్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. పార్టీలో వెలుగొందిన అగ్రనేతలంతా ఇతర పార్టీలకు జంప్ అయ్యారు, మరికొందరు నేతలు స్తబ్దుగా ఉండిపోయారు. దీంతో పార్టీని ముందుకు నడిపించే సరైన నాయకులు కరువయ్యారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఎల్.రమణ, పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బక్కని నర్సింహులు కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.
కాగా తెలంగాణ లో పార్టీని బలోపేతం చేయాలంటే ఆర్ధిక, అంగబలం రెండూ అవసరమే. ఆర్ధికంగా తాను బలమైన నేత కానందున, అధ్యక్ష బాధ్యతలు భుజాన వేసుకునేందుకు బక్కని మొదట్లోనే సంశయించారు. హైకమాండ్, తోటి నేతల బలవంతంతోనే ఆనాడు ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అయితే అది తాత్కాలికంగా మాత్రమే అయుండొచ్చు అనేది అందరి మదిలో ఉన్న ఆలోచనే. అయితే వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకురావాలని ఆలోచిస్తున్న చంద్రబాబు మరోసారి టీటీడీపీ అధ్యక్ష పదవిపై ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడిని మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. బక్కని నర్సింహులు స్థానంలో కాసాని జ్ఞానేశ్వర్ కు పార్టీ బాధ్యతలు ముట్టజెప్పారు. మరి కాసాని(Kasani Gnaneswar) ఆధ్వర్యంలో టీటీడీపీకి పూర్వవైభవం వస్తుందా అనేది వేచి చూడాల్సిందే.