Nara Lokesh comments acqua holiday: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్‌పై మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఆక్వా రంగాన్ని ఉద్ధరిస్తానని చెప్పి.. ఆక్వా రైతులను దగా చేశాడంటూ దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా వేసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటి వరకు పవర్ హాలిడే, క్రాప్ హాలీడే, ఇప్పుడు ఆక్వా హాలిడే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జగన్ రెడ్డి హాలిడే తీసుకోవటం మిగిలి ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం అసమర్థతతోనే ఆక్వా రంగం సంక్షోభంలో పడిందని ఆరోపించారు.
కొత్త చట్టాల పేరిట ఆక్వా రైతులను, ప్రాసెసింగ్ ప్లాంట్ల్ నిర్వహాకులను వైసీపీ నేతలు వేధిస్తూ, కోట్లు దండుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, దాణా ఖర్చులు, చెరువుల నిర్వహణ భారాలతో ఆక్వా రైతులు కుదేలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వంద కౌంట్ కిలో రొయ్య ఉత్పత్తికి రూ.270 ఖర్చవుతుంటే కనీసం రూ.200 సైతం రాకపోవటంతోనే.. రైతులు ఆక్వా హాలిడే ప్రకటిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని, ఆక్వా రైతులను ఆదుకోవాలని హితువు పలికారు. రాయితీపై దాణా, ఆక్వా సామాగ్రి ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా లోకేష్ (Nara Lokesh) డిమాండ్ చేశారు.