Marri Shashidhar Reddy announce his Resigns for Congress party: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. చాలా బాధతో పార్టీకి రాజీనామా చేశాననీ.. రాజీనామాకు గల కారణాలను సోనియాగాంధీకి లేఖ రాసినట్లు వివరించారు. త్వరలోనే తను బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మర్రి శశిధర్ రెడ్డి, పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందన్నారు. అందువల్లే కఠిన నిర్ణయం తీసుకోక తప్పవలేదన్నారు. తెలంగాణ బాగు కోసమే.. తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందనీ.. ఈ విషయం ప్రజల్లో బాగా పాతుకుపోయిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితిని అస్సలు ఊహించలేదనీ.. ప్రతిపక్ష పాత్రను పోషించటంలోనూ కాంగ్రెస్ విఫలం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జీలు హైకమాండ్‌కు ప్రతినిధిగా ఉంటూ.. అందర్నీ సమన్వయం చేసుకోవాలి. తప్పులు, లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి.. కానీ పీసీసీ అధ్యక్షులకు ఏజెంట్లుగా మారిపోయారని ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్‌లో డబ్బు ఇచ్చే వారి మాటే చెల్లుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నుంచి అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతూ వచ్చిందని గుర్తు చేశారు. అయినా అతడిని ఆరేళ్ల పాటు కొనసాగించారన్నారు.
కాగా, మర్రి శశిధర్ ఇటీవల అమిత్‌షాని కలవటం.. కాంగ్రెస్‌కు క్యాన్సర్ సోకిందంటూ వ్యాఖ్యానించటం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేయటంతో మర్రిపై కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉంది. అనంతరం శశిధర్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. అయితే, మునుగోడు ఉపఎన్నిక సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా క్యాపెయిన్ చేసినా, కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్పినా.. ఎటువంటి చర్యలు తీసుకోని, కాంగ్రెస్ అధిష్టానం మర్రి శశిధర్‌ను బహిష్కరించటం పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే మర్రి శశిధర్ (Marri Shashidhar Reddy) పార్టీకి రాజీనామా చేయటం, కాంగ్రెస్‌ను వీడటం తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, తెలంగాణ కాంగ్రెస్ త్వరలోనే ఖాళీ అయ్యేటట్లు కనిపిస్తోంది.