Union Budget 2023: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. కేంద్ర బడ్జెట్ సమవేశాల ప్రారభం సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం అన్నారు. దేశ ప్రగతిలో యువ శక్తి, నారీ శక్తి భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. పేదరికం లేని భారత్ నిర్మాణం కావాలని, ఆత్మనిర్భర్ భారత్ నిర్మించుకుందామని, గతంలో ప్రపంచం మీద భారత్ ఆధారపడింతే ప్రస్తుతం ప్రపంచ సమస్యలకు భారత్ పరిష్కారం చూపగలిగే స్థాయికి ఎదిగిందన్నారు. రాష్ట్రపతి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘భారత్ డిజిటల్ నెట్ వర్క్ వ్యవస్థ ప్రపంచానికే ఉదాహరణగా మారింది. పేదలు గిరిజనులు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం పని చేస్తోంది. మూడు కోట్ల మందికి సొంత ఇళ్లు నిర్మించాం. మూడేళ్లలో 11 కోట్ల మందికి ఇంటింటికి మంచినీరు అందించామని, దేశ ప్రజలకు కోవిడ్ నుంచి ప్రభుత్వం విముక్తి కల్పించిందని అన్నారు. మహిళా సాధికారతను ప్రోత్సహిస్తున్నాం. చిన్న సన్నకారు రైతులను ఆదుకుంటున్నాం. ఫసల్ బీమా యోజన, కిసాన్ కార్డు వంటి పథకాలు అమలు చేస్తున్నాం. పంట నష్టపోయిన రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటున్నాం. కనీస మద్దతు ధర పెంచి రైతులను బోలోపేతం చేస్తున్నాం. ఆదివాసీ ప్రాంతాల్లో ఆదర్శ పాటశాలల ఏర్పాటుతో పాటు తొలిసారిగా బిర్సా ముండా జయంతి ఉత్సవాలు జరిపాం. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు, తీవ్రవాద ప్రభావిత జిల్లాల అభివృద్దికి కృషి, ఈశాన్య రాష్ట్రాలు, సరిహద్దు గ్రామాల్లో రక్షణ చర్యలు చేపట్టామన్నారు. అన్ని రంగాల్లో మహిళలు ముందుండేలా చర్యలు తీసుకున్నామన్నారు. పేదలకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతోందని, పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించేలా చర్యలు తీసుకోబడుతున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని చెప్పారు.