KCR Holi Greetings |వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా, పచ్చని చిగురులతో కొత్తదనం సంతరించుకుని, వినూత్నంగా పున:ప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోళీ పండుగ స్వాగతం పలుకుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. చిగురించే ఆశలతో తమ జీవితాల్లోకి నూతనత్వాన్ని హోళీరూపంలో స్వాగతం పలికే భారతీయ సాంప్రదాయం రమణీయమైనదన్నారు. రాష్ట్ర, దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు హోళీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. హోలి పండుగ నేపథ్యంలో పల్లెలన్నీ వెన్నెల నవరాత్రుల్లో సాగే చిన్నారుల జాజిరి ఆటా పాటలతో, కోలాటాల చప్పుల్లతో ఉత్తేజం వెల్లివిరుస్తుందని సీఎం తెలిపారు. బేధభావాలను వీడి పరస్పర ప్రేమాభిమానాలను చాటుకుంటూ ప్రజలందరూ మోదుగుపూల వంటి సహజసిద్దమైన రంగులతో హోళీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.