South Africa |టీ20 క్రికెట్‌లో అసాధ్యాలు సాధ్యమవుతుంటాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక ఫ్యాన్స్ నిత్యం టెన్షన్ పడుతూనే ఉంటారు. చివరి నిమిషంలో మ్యాచ్ తారుమారు అవుతుంది. తాజాగా.. ఇలాంటి మ్యాచే ఇవాళ(మార్చి 26) జరిగింది. అంతర్జాతీయ క్రికెట్‌లో సౌతాఫ్రికా జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. టీ20ల్లో ఏకంగా 259 పరుగులను చేధించి, అత్యధిక టార్గెట్‌ను ఛేజ్ చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 259 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని మరో ఏడు బంతులు ఉండగానే ఉఫ్‌మని ఊదేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 258 పరుగుల సాధించింది.
వెస్టిండీస్ బ్యాటర్ జాన్సన్ ఛార్లెస్ (118: 46 బంతుల్లో, 10 ఫోర్లు, 11 సిక్సర్లు) శతక్కొట్టాడు. దీంతో ఇక సౌతాఫ్రికా పనైపోయిందిలే అనుకున్నారంతా. కానీ ఓపెనర్లు డి కాక్ (100: 44 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు), హెండ్రిక్స్ (68: 28 బంతుల్లో, 11 ఫోర్లు, రెండు సిక్సర్లు) వీర లెవెల్‌లో ఉతికేశారు. పవర్ ప్లేలోనే స్కోరును వంద దాటించేశారు. డికాక్ అయితే తన మొట్టమొదటి టీ20 ఇంటర్నేషనల్ సెంచరీ కూడా బాదేశాడు. హెండ్రిక్స్, కెప్టెన్ మార్ క్రమ్ (38 నాటౌట్: 21 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా అదరగొట్టటంతో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఏడు బంతులు ఉండగానే సౌతాఫ్రికా(South Africa) గెలిచేసింది. చరిత్ర సృష్టించింది. మూడు మ్యాచుల టీ20 సిరీస్ ను 1-1తో సమం చేసేసింది.
Read Also: ఆర్టీసీ ప్రయాణికులకు సూపర్ న్యూస్
Follow us on: Google News, Koo, Twitter