ముఖ్యమంత్రి కేసీఆర్ పై YSRTP అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సొమ్ము మీ తాత జాగీరా కేసీఆర్..? అంటూ ముఖ్యమంత్రిని విమర్శించారు. ఈ మేరకు ఆమె శనివారం ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. తెలంగాణ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉద్యోగాలు ఇవ్వడం చేతకాలేదు కానీ, పక్క రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ వ్యక్తికి లక్షల ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తావా అని నిలదీశారు. తెలంగాణ సంపద ఏమైనా మీ అత్తగారి సొమ్మా? అని ఎద్దేవా చేశారు. ‘తెలంగాణ కొలువులు ఏమైనా మీ ఇంట్లో నౌకరు పదవులా మీ ఇష్టారాజ్యంగా రాసివ్వడానికి..? అని పేర్కొన్నారు. అందుకోసమేనా పేపర్లు లీక్ చేసి అమ్ముకుంటున్నారని, జీవోలు దాచిపెట్టి కొలువులు కట్టబెడుతున్నారని ఆరోపించారు.
పార్టీ ఖజానాలో ఉన్న రూ.1250 కోట్లు సరిపోవడం లేదా? అని ప్రశ్నించారు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలను కూడా బీఆర్ఎస్(BRS) పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టాలని చూస్తున్నావా? అని ప్రశ్నించారు. ఇలా జీవోలను దాచిపెట్టి ఇంకా ఎంతమందికి కొలువులు ఇచ్చారు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పదవుల కోసం ఇచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరో ట్వీట్ చేస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR)కు జాతీయ రాజకీయాలే ముఖ్యమన్నారు. మహారాష్ట్ర రైతులకు మాయమాటలు చెప్పి కండువాలు కప్పే కేసీఆర్ కు.. తెలంగాణ రాష్ట్ర రైతుల కష్టాలు కనపడడం లేదా? ఇకనైనా మేలుకో అంటూ సీఎంకు సూచించారు. రాష్ట్రంలో తడిసిన వడ్లు కొనడంతో పాటు ఎకరాకు రూ. 30 వేల నష్టపరిహారం కూడా ఇవ్వాలని షర్మిల(YS Sharmila) డిమాండ్ చేశారు.
Read Also: కొత్త సచివాలయం వద్ద MLA రాజాసింగ్ కు చేదు అనుభవం
Follow us on: Google News, Koo, Twitter