తెలంగాణ సీఎం కేసీఆర్ కి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. జూనియర్ పంచాయితీ సెక్రటరీల రెగ్యులరైజేషన్ చేయాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు. మీ ప్రభుత్వంలో జూనియర్ పంచాయితీ కార్యదర్శుల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైంది. వాళ్లతో గొడ్డు చాకిరీ చేయించుకుని వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వారు గత 12 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా మీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేదు అంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ ప్రభుత్వం దేశంలోనే మా పంచాయితీలు ఆదర్శం అందుకే కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది అని గొప్పలు చెప్పుకుంటోంది. ఆ గొప్పల వెనుక జూనియర్ పంచాయితీ కార్యదర్శులు పడిన శ్రమ ఉంది. వారి కష్టంతో రాష్ట్రంలో గ్రామపంచాయితీలకు 79 అవార్డులు వచ్చిన విషయాన్ని మరిచిపోవద్దు. ఇంత చేసి మీకు అవార్డులు తెస్తే వారి సర్వీసులను రెగ్యులర్ చేయకుండా వేధించడం సరైంది కాదు. వారి కష్టానికి మీ ప్రభుత్వం ఇచ్చే రీవార్డు ఇదేనా? అని రేవంత్(Revanth Reddy) ప్రశ్నించారు.
సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరకుంటే తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడటం మీ దిగజారుడుతనానికి నిదర్శనం. ఎంతో పనిభారం పెరిగినా భరిస్తూ రెగ్యులర్ చేస్తారని వారు ఆశగా ఎదురు చూశారు. నాలుగేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ముగిసినా తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేదు. రాష్ట్రంలో పాలన ఉన్నట్టా లేనట్టా? అని సర్కార్ ని నిలదీశారు.
ఇప్పటికైనా పంచాయితీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలి. లేకపోతే వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచి, వారి తరపున ప్రత్యక్ష కార్యచరణకు సైతం సిద్ధమవుతాం అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కాగా ఆయన లేఖ ద్వారా ప్రభుత్వానికి కీలక డిమాండ్స్ చేశారు.
రేవంత్ రెడ్డి చేసిన డిమాండ్స్:
జూనియర్ పంచాయితీ కార్యదర్శులు కోరుకుంటున్న విధంగా వారి ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలి.
4 సంవత్సరాల సర్వీసులను పరిగణనలోకి తీసుకోవాలి.
కేడర్ స్ట్రెంత్ తో పాటు సర్వీసును రూపొందించాలి.
010 పద్దు కింద వేతనాలిస్తూ EHS కార్డులను అందజేయాలి.
చనిపోయిన పంచాయితీ కార్యదర్శుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించేలా కారుణ్య నియామకాలు చేపట్టాలి.
OPS (Out Sourcing Secretary) వారిని కూడా రెగ్యులర్ చేయాలి.
ఇతర శాఖల్లోని ప్రభుత్వ మహిళా ఉద్యోగుల మాదిరిగా మహిళా పంచాయితీ కార్యదర్శులకు 6 నెలల ప్రసూతి సెలవులు, 90 రోజుల చైల్డ్ కేర్ సెలవులు ఇవ్వాలి.
Read Also: కర్ణాటకలో అనుకున్న దానికంటే 15 సీట్లు ఎక్కువే గెలుస్తాం: అమిత్ షా
Follow us on: Google News, Koo, Twitter