ఖమ్మం నగరంలోని లకార్ చెరువులో శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని(NTR Statue) ఏర్పాటు చేయడాన్ని టాలీవుడ్ నటి కరాటే కల్యాణి(Karate Kalyani) వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై మా అసోసియేషన్(Maa Association) సీరియస్ అయింది. తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైన ఎన్టీఆర్‌పై ఆ విధమైన వ్యాఖ్యలు ఎందుకు చేశారో వివరణ ఇవ్వాల్సిందిగా కరాటే కళ్యాణికి ‘మా’ షోకాజ్ నోటీసు పంపింది. ఈ నోటీసుపై మూడు రోజుల్లో స్పందించాలని గడువు ఇచ్చింది. అయితే, ఇచ్చిన గడువులో వివరణ ఇవ్వకపోగా.. ‘మా’కు లీగల్ నోటీసు పంపడంపై అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మా’ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నందుకు గాను కరాటే కళ్యాణిపై చర్యలు తీసుకుంటూ ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ మేరకు గురువారం కరాటే కళ్యాణికి సస్పెన్షన్ నోటీసు పంపింది. అయితే, ఈ సస్పెన్షన్‌పై కరాటే కళ్యాణి స్పందించారు. ‘నేను ఏం తప్పుచేశానో నాకు అర్థం కావడం లేదు. నేను ఎన్టీఆర్‌కు వ్యతిరేకం కాదు. కృష్ణుడి రూపంలో ఆయన విగ్రహం పెడితే సమాజంలోకి తప్పుగా వెళ్తుంది.. ప్రతి హీరోకి దేవుడి రూపంలో విగ్రహం పెడితే దేవుళ్లు ఇంకెందుకు.. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టి ఆయన రూపాన్ని ఎందుకు అవమానిస్తున్నారు.. మా అందరికీ ఆయన ఎంతో ఇష్టమైన దైవం.. అక్కడ ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగే దేవుడికి అన్యాయం జరిగినట్టే కదా.. విగ్రహ ఏర్పాటును ఆపేయండి అని అడిగినందుకు మీరు అసోసియేషన్ నుంచి ఇలా మాట్లాడకూడదు అని నాకు షోకాజ్ నోటీసు పంపారు’ అని కరాటే కళ్యాణి(Karate Kalyani) చెప్పుకొచ్చారు.