బీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) తీవ్ర స్థాయిలో మండిప్డడారు. రీజనల్‌రింగ్ రోడ్డు అంశంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం కొన్ని నెలలు ముందే భూములు తీసుకుంటున్నారన్నారు. భూసేకరణ పేరుతో బలహీన వర్గాలు, హరిజన, దళితుల భూములను బలవంతంగా తీసుకోవడం సరైంది కాదన్నారు. గవర్నమెంట్ భూములు తీసుకోకుండా, రైతుల దగ్గర ఉన్న ఎకరం, రెండు ఎకరాల భూమిని గుంజుకోవడం విచిత్రంగా ఉన్నదన్నారు. వారసత్వంగా వస్తున్న కొద్దిపాటి భూమి పోతోందన్న బాధతో ఎంతో మంది రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. భువనగిరి, రాయగిరి, ఇంకా మిగిలిన గ్రామాల రైతులు ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారన్నారు.
అన్యాయంపై శాంతియుతంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తుంటే..కొందర్ని అరెస్ట్ చేసి జైలుకు పంపడం ఆశ్చర్యంగా ఉన్నదన్నారు. భువనగిరి జిల్లా సెషన్స్ కోర్టు సదరు రైతులకు బెయిల్ మంజూరు చేసిందన్నారు. అయితే కోర్టుకు తీసుకొచ్చే క్రమంలో రాయగిరి రైతులకు బేడీలు వేయడం చూసి తన కళ్లలో నీళ్లు తిరిగాయని ఎంపీ(Komatireddy Venkat Reddy) ఆవేదన వ్యక్తం చేశారు.భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా బరువెక్కిన గుండెతో మాట్లాడుతున్నాను అంటూ భావొద్వేగానికి గురయ్యారు. దేశంలో ఎక్కడా ఈ పరిస్థితి లేదన్నారు.రైతులకు సంకెళ్లు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని కోరారు.